ఖమ్మం: ఉమ్మడి ఖమ్మం జిల్లా మధిర అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని ముదిగొండలో ఆదివారం సాయంత్రం ఉద్రిక్తత నెలకొంది. టీఆర్ఎస్ కార్యకర్తలు డబ్బులు పంచుతున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఓటమి భయంతో మల్లు భట్టి విక్రమార్క తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలతో ఉద్రిక్తత నెలకొంది.

ఆధార్ కార్డులు, బ్యాంకు అకౌంట్లను సేకరిస్తూ ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి మల్లు భట్టి విక్రమార్క పోలీస్ స్టేషన్ కు వచ్చి ఈ విషయమై పోలీసులతో చర్చించారు.

తాము పట్టించిన వారిని పోలీసులు వదిలేశారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.ఈ విషయం తెలుసుకొన్న టీఆర్ఎస్ కార్యకర్తలు కూడ ముదిగొండ పోలీస్ స్టేషన్ కు చేరుకొన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.

ఓటమి భయంతోనే మల్లు భట్టి విక్రమార్క తప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారని టీఆర్ఎస్ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. భట్టి విక్రమార్కపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు

రెండు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకొన్నారు. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకొంది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. భట్టి విక్రమార్కకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. చాలా కాలంగా ఇలాగే  పోలీసులు చూసీ చూడనట్టుగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ముదిగొండలో డబ్బుల కలకలం: పోలీసులకు భట్టి ఫిర్యాదు