హైదరాబాద్: ఆర్ధికంగా వెనుకబడిన  (ఈడబ్ల్యుఎస్) వారికి ఉద్యోగాలు, విద్యలో 10 శాతం రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంది. 

ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకొన్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే  జీవోను కూడ జారీ చేసిన విషయం తెలిసిందే.

వివిధ రాష్ట్రాల్లో ఈడబ్ల్యుఎస్ కోటా అమలుపై అధ్యయనం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసులు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఓ కమిటీని నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నారు అధికారులు.

ఒకవేళ అదే జరిగితే ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేయడానికి మరో రెండేళ్లు ఆలస్యమయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.

విద్య, ఉపాధిలో ఈడబ్ల్యుఎస్ కు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ 2019 జనవరిలో నరేంద్రమోడీ ప్రభుత్వం పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ బిల్లును ఆమోదం పొందింది.  ఈడబ్ల్యుఎస్ కోటాను ఎప్పుడు అమలు చేయాలనే దానిపై నిర్ణయాన్ని రాష్ట్రాలకే కేంద్రం వదిలేసింది.

2019, 2020లలో పలు రాష్ట్రాలు ఈ విధానాన్ని అమలు చేశారు. కానీ తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే జీవో జారీ చేసింది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది జనవరి మాసంలో ఈడబ్ల్యుఎస్ కోటాను అమలు చేయాలనే నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఈ నెల 8వ తేదీన జీవో జారీ చేసింది.

ఆర్ధికంగా వెనుకబడిన వారికి 10 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తే  బీసీలు, ఎస్సీలు, ఎస్టీ, మైనారిటీలకు అందించే 50 శాతం రిజర్వేషన్లకు భంగం వాటిల్లకూడదు.

అలా జరగాలంటే విద్యాసంస్థల్లో సూపర్ న్యూమరీ సీట్లు, ప్రభుత్వ విభాగాల్లో సూపర్ న్యూమరీ ఉద్యోగాలు కల్పించడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. మిగిలిన 50 శాతం ఓపెన్ కేటగిరి కింద కులం, మతం సంబంధం లేకుండా అందరూ పోటీపడొచ్చు.

10 శాతం ఈబ్ల్యుఎస్ కోటా అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సూపర్ న్యూమరీ పోస్టులను, సీట్లను కేటాయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

మరోవైపు కేంద్రం 20 శాతం సూపర్ న్యూమరీ సీట్లను సృష్టించింది. ఈబ్ల్యుఎస్ కోటాను అమలు చేయడానికి ఉద్యోగాలు, సీట్లకు ఈడబ్ల్యుఎస్ కు మిగిలిన 10 శాతంం రిజర్వ్ కేటగిరిలో పంపిణీ చేస్తారు.

ఏపీ రాష్ట్రంలో మాత్రం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ల అమలు కోసం 10 శాతం సూపర్ న్యూమరీ సీట్లను సృష్టించింది. అయితే ఏ రకమైన పద్దతిని అవలంభించాలనే దానిపై అధికారులు ఇంకా ఓ నిర్ణయానికి రాలేదు. దీంతో  ప్రభుత్వం ఏర్పాటు చేసే కమిటీ చేసే సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం తీసుకొనే అవకాశాలున్నాయి.