రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో అధికార టీఆర్ఎస్‌లో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. ఏకంగా మున్సిపల్ కార్యాలయం సాక్షిగా నేతలు బాహాబాహీకి దిగారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఛైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌ల మధ్య శనివారం ప్రోటో కాల్ వివాదం తలెత్తింది.

సర్దార్ వల్లభబాయ్ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో పూలమాలలు వేసే క్రమంలో ప్రోటోకాల్ పాటించాలని వైస్ చైర్మన్ వాగ్వాదానికి దిగాడు.

దీంతో అప్పటికే రెండు వర్గాలుగా విడిపోయిన కౌన్సిలర్లు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ, ఒకరినొకరు నెట్టుకుంటూ ఘర్షణకు దిగారు. అక్కడే ఉన్న మరికొంతమంది కౌన్సిలర్లు అపేందుకు ప్రయత్నం చేసినా ఎవరూ ఆగలేదు.

అంతేకాకుడా టీఆర్‌ఎస్‌ పార్టీ, నాదంటే నాది అనుకుంటూ వాగ్వాదానికి దిగారు. కాగా గత కొంత కాలంగా మున్సిపల్‌లో చైర్మన్ రామ తీర్థపు మాధవి, ఆమె భర్త రాజుకు వైస్ చైర్మన్ మధు రాజేందర్‌కు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి .

గతంలో ఈ విషయాన్ని స్థానిక ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లినా వారు పట్టించుకోకపోవడంతో గొడవలు ప్రారంభమయ్యాయి. ఏది ఏమైనా ప్రజలకు సేవ చేయాల్సిన కౌన్సిలర్లు కొట్లాడుకోవడం, అందులోనే ఇద్దరూ అధికార పక్ష నాయకులు వాదులాడుకోవడం పెద్ద చర్చకు దారి తీసింది. మరోవైపు కౌన్సిలర్లు తన్నుకోవడంపై అధిష్టానం కానీ, స్థానిక ఎమ్యెల్యే రమేష్ బాబు, జిల్లా మంత్రి కేటీఆర్‌ స్పందించలేదు.