ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరం.. గవర్నర్ తమిళిసై
ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల ఉస్మానియా ఆస్పత్రిని వెంటనే పునరుద్దరించాలని కోరారు.
హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలంగాణ గవర్నర్ తమిళిసై అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర గల ఉస్మానియా ఆస్పత్రిని వెంటనే పునరుద్దరించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ నెటిజన్ ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు. వివరాలు.. ‘‘జస్టిస్ ఫర్ ఓజీహెచ్’’ పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్‌లో ఉస్మానియా ఆస్పత్రికి సంబంధించి గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలుపుకోవాలని కోరుతూ పోస్టు చేశారు. ‘‘ఉస్మానియా జనరల్ ఆస్పత్రి పునర్నిర్మాణం గురించి గతంలో చేసిన హామీలను మరోసారి గుర్తించి చర్యలు తీసుకోవాలని మేము ప్రభుత్వానికి వినమ్రంగా విజ్ఞప్తి చేస్తున్నాము’’ అని ఆ పోస్టులో పేర్కొన్నారు. జాయింట్ అసోషియేషన్ ఫర్ న్యూ ఓజీహెచ్ పేరుతో కూడిన లేఖను కూడా షేర్ చేశారు.
ఈ పోస్టులో తెలంగాణ సీఎంవో, గవర్నర్ తమిళిసై, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు అకౌంట్‌లను ట్యాగ్ చేశారు. అయితే ఈ పోస్టుపై స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. ఉస్మానియా ఆస్పత్రి పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. శతాబ్దాల నాటి ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా జనరల్ హాస్పిటల్ దుస్థితిని చూసి ఆందోళన చెందుతున్నానని పేర్కొన్నారు. శిక్షణ, వైద్యానికి ఎంతో గర్వకారణమైన ఉస్మానియా ఆస్పత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరగా చేపట్టాలని కోరారు.