దిశ హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేసి ఆమెకు న్యాయం చేశారంటూ దేశవ్యాప్తంగా సైబరాబాద్ పోలీస్ కమీషనర్ వీసీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇదే సమయంలో కొందరు మానవ హక్కుల కార్యకర్తలు సైతం విరుచుకుపడుతున్నారు.

తాజాగా హైదరాబాద్‌కు చెందిన ఓ స్వచ్చంద సంస్థ సజ్జనార్‌పై ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీపీతో పాటు నలుగురు పోలీసులపై హత్య కేసు నమోదు చేయాలని ‘‘నేను సైతం’’ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు డి. ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.

అతను ఇచ్చిన ఫిర్యాదుపై రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు దిశ హత్యాచార నిందితుల ఎన్‌కౌంటర్‌పై దర్యాప్తుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.

రాచకొండ సీపీ మహేశ్ భగవత్ నేతృత్వంలో ఏడుగురు సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేసి, ఎన్‌కౌంటర్‌పై పూర్తి స్థాయి విచారణ జరపాని ఆదేశించింది. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో అన్ని సాక్ష్యాధారాలను, ఆపరేషన్‌లో పాల్గొన్న పోలీసుల నుంచి సమాచారాన్ని సేకరించి ప్రభుత్వానికి నివేదిక అందించనుంది.

వనపర్తి జిల్లా ఎస్పీ అపూర్వ రావు, మంచిర్యాల డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి, రాచకొండ అడిషనల్ డీసీపీ సురేందర్ రెడ్డి, సంగారెడ్డి డీఎస్పీ పి. శ్రీధర్ రెడ్డి, రాచకొండ ఐటీ  సెల్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి, కోరుట్ల సీఐ శేఖర్ రాజు, సంగారెడ్డి డీసీఆర్‌బీ ఇన్స్‌పెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సిట్‌లో సభ్యులుగా ఉన్నారు. సున్నితమైన కేసు కావడంతో సిట్ బృందానికి సహకరించాలని ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.