తెలంగాణ రాష్ట్రం నిర్మల్ జిల్లాలోని భైంసా పట్టణంలో నిన్న రాత్రి మతఘర్షణలు చోటు చేసుకున్నాయి. రాత్రి చిన్న వాగ్వివాధంగా కొందరు వ్యక్తుల మధ్య మొదలైన గొడవ తీవ్రమై రెండు వర్గాలు రాళ్లు విసురుకుంటూ ఒకరిపై ఒకరు దాడులు చేసుకునే వరకు వెళ్ళింది. 

వివరాల్లోకి వెళితే... నిన్న రాత్రి ఒక ప్రార్థనామందిరంలో ఒక నలుగురు వ్యక్తులు ప్రార్థనలు చేస్తుండగా... మద్యం మత్తులో వచ్చిన ఒక వ్యక్తి లోపలి ప్రవేశించి అక్కడ హల్చల్ చేసాడు. ఇలా అక్కడ వాదన పెరిగి చిన్న ఘర్షణకు దారి తీసింది. 

ఇక ఆ చిన్న ఘర్షణ చిలికి చిలికి గాలివానగా మారింది. ఇరు వర్గాలకు చెందిన వారు గుమికూడి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకుంటూ... ఘర్షణలకు దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. 

సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు. అక్కడికి చేరుకున్న ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించి వెంటనే కర్ఫ్యూ విధించారు. 250 మంది పోలీసులతో అక్కడ గట్టి బందోబస్తును ఏర్పాటు చేసారు. 

గతంలో కూడా భైంసా పట్టణంలో మతఘర్షణలు చోటు చేసుకున్న చరిత్ర ఉంది. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని, ఇరు వర్గాల మత పెద్దలతో మాట్లాడుతున్నామని అధికారులు చెబుతున్నారు. 

ఇకపోతే... ఈ సంవత్సరం ఆరంభంలో జనవరి నెలలో కూడా ఈ పట్టణంలో మతఘర్షణలు జరిగాయి. జనవరి 12వ తేదీ 9 గంటల ప్రాంతంలో  ఒక వర్గానికి చెందిన యువకుడు బైక్ తో చేసిన అతి విన్యాసాలు ఈ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి. చిన్నగా మొదలైన  వివాదం పట్టణమంతా పాకి తీవ్రరూపం దాల్చి పట్టణం మొత్తంతో హింసకు కారణమయినా విషయం తెలిసిందే!