ఓ యువతి చేసిన ట్వీట్ ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలకలం రేపింది. యువతి చేసిన ట్వీట్ కి అధికారుల దిమ్మ తిరిగిపోయింది. ఆమె ట్వీట్ కి మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా స్పందించడం విశేషం. ఇంతకీ మ్యాటరేంటంటే...

‘‘అక్రమ నిర్మాణాలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మీరంతా అవినీతిపరులా? లేదా, రాజకీయ ఒత్తిళ్లు ఏమైనా ఉన్నాయా? మీ వల్ల తెలంగాణ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. చెప్పడానికి సిగ్గుపడుతున్నాను.’’ అంటూ రిషితా రెడ్డి అనే యువతి ట్వీట్ చేసింది.

ఈ ట్వీట్‌ చర్చనీయాంశంగా మారింది. స్పందించిన కేటీఆర్‌.. అక్రమ నిర్మాణం ఆరోపణను వీలైనంత త్వరగా పరిశీలించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, సీసీపీలను కోరారు. విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని దానకిషోర్‌ ట్విటర్‌లో సమాధానమిచ్చారు. ఫిర్యాదు అందిన వెంటనే నిబంధనల ప్రకారం నోటీసులు ఇచ్చామని, అన్నివేళలా ఇలాంటి విషయాలు బహిర్గతం చేయలేమని విజిలెన్స్‌ డైరెక్టర్‌ విశ్వజిత్‌ పేర్కొన్నారు.
 
   సోమాజిగూడలోని కపాడియా లేన్‌లో అకమ్రంగా పదంతస్తుల హోటల్‌ నిర్మిస్తున్నారని కొన్నాళ్ల క్రితం జీహెచ్‌ఎంసీకి ఫిర్యాదు అందింది. దీనికి సంబంధించి ఈ నెల 16న అనుమతి తీసుకున్న ప్లాన్‌, ప్రొసిడింగ్స్‌, ట్రేడ్‌ లైసెన్స్‌, ఫైర్‌ ఎన్‌ఓసీ ఇవ్వాలని నోటీసులు ఇచ్చామంటూ ఆ కాపీని విశ్వజిత్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు. నోటీసులిచ్చారు కానీ, ఇప్పటివరకూ చర్యలేమీ తీసుకోలేదని ప్రతిగా మరో వ్యక్తి పోస్ట్‌ చేశారు. పట్టణ ప్రణాళికా విభాగం సిబ్బంది పరిశీలించారని, త్వరలో పూర్తి వివరాలు వస్తాయని విశ్వజిత్‌ బదులిచ్చారు.