సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా తెలంగాణ బిడ్డ  జస్టిస్ ఆర్ సుభాష్‌రెడ్డి పదోన్నతి పొందనున్నారు. గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న సుభాష్‌రెడ్డిని సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని కొలీజియం సోమవారం కేంద్రానికి సిఫారసు చేసింది.  ఆయనతోపాటు మధ్యప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హేమంత్ గుప్తా, పాట్నా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఆర్ షా, త్రిపుర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అజయ్ రస్తోగీల పేర్లను కూడా సిఫారసు చేశారు.

 సుప్రీంకోర్టులో ఖాళీల దృష్ట్యా అన్ని రాష్ట్రాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే ఉద్దేశంతో తెలంగాణ నుంచి జస్టిస్ సుభాష్‌రెడ్డిని ఎంపిక చేసినట్టు సమాచారం. సుప్రీంకోర్టులో మొత్తం 31 మంది జడ్జిలు ఉండాల్సి ఉండగా ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. ఈ నలుగురి నియామకాలు పూర్తయితే న్యాయమూర్తుల సంఖ్య 28కి చేరుతుంది. జస్టిస్‌లు కురియన్ జోసెఫ్ నవంబర్‌లో, ఎంబీ లోకూర్ డిసెంబర్‌లో, ఏకే సిక్రీ మార్చిలో రిటైర్ కానుండటంతో మరో మూడు ఖాళీలు ఏర్పడనున్నాయి.

సుభాష్ రెడ్డి సరిగ్గా  38 సంవత్సరాల క్రితం 1980 అక్టోబర్ 30వ తేదీన న్యాయవాదిగా బార్ కౌన్సిల్‌లో నమోదు చేసుకున్నారు. 22 సంవత్సరాల పాటు వేల కేసులను వాదించారు. 2002 డిసెంబర్‌లో ఏపీ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా, 2004 జూన్‌లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2016 ఫిబ్రవరి 13వ తేదీన గుజరాత్ ఛీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు ఉన్న సీనియార్టీ దృష్ట్యా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి కల్పించేందుకు కొలీజియం సిఫారసు చేసింది. దీనిపై త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసే అవకాశం ఉన్నది.