ఎన్నో ఏళ్లక్రితం ఆ కుటుంబానికి వంశపారంపర్యంగా వచ్చిన భూమి అన్యాక్రాంతమయ్యింది. భూమికి సంబంధించిన పత్రాలన్నీ వారివద్దే వున్న భూమి హక్కులు మాత్రం వేరేవారి పేరుపైకి మరాయి.తెలంగాణ ప్రభుత్వం అందించే రైతు బంధు పథకం నగదు డబ్బులు కూడా ఆ  కబ్జాధారులే నొక్కేశారు. దీంతో కొటీశ్వరులైన వారిని ఎదుర్కోలేక... అన్నం పెట్టే భూమిని వదులుకోలేక ఆ కుటుంబం నరకయాతన అనుభవించింది. చివరకు రెవెన్యూ అధికారులు కూడా వారికే సహకరించడంతో చేసేదేమీ లేక ఏకంగా సోషల్ మీడియా ద్వారా ముఖ్యమంత్రి దృష్టికే తమ సమస్యను తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ రైతు బిడ్డకు ఫోన్ చేసి  మాట్లాడటమే కాదు...అప్పటికప్పుడు అతడి భూమి సమస్యను పరిష్కరించారు.

ఆ రైతు ఇంటికే కలెక్టర్ ను పంపించి అతడి సమస్య గురించి ముఖ్యమంత్రి ఆరా తీయించారు. ఇలా మధ్యాహ్నం అతడి  నుండి ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ సాయంత్రానికి అతడి చేతిలో భూమికి సంబంధించిన పట్టా పెట్టారు. ఇలా ఏళ్లుగా పరిష్కారం కాని సమస్య సీఎం చొరవతో ఒక్కరోజులోనే పరిష్కారమవడంతో ఆ రైతు కళ్లలో ఆనందం వెల్లివిరిసింది. 

ఈ ఘటన  మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. నేర్నాల మండలం నందుపల్లికి చెందిన రైతు శరత్‌ తమ కుటుంబం ఎదుర్కొంటున్న భూ సమస్యను శరత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో అతడిని ఆవేధనను గుర్తించిన నెటిజన్లు ఆ పోస్ట్ ని బాగా వైల్ చేశారు. దీంతో అదికాస్తా ఏకంగా ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లి ఆయనే స్వయంగా బాధితుడికి ఫోన్ చేసి సమస్యను పరిష్కరించేలా చేసింది.

శరత్ కుటుంబానికి సంబంధించిన భూ సమస్యను పరిష్కరించాలని మంచిర్యాల కలెక్టర్‌  భారతి  హూలికేరిని సీఎం ఆదేశించారు. దీంతో జిల్లా అధికారులంతా కదిలి వెంటనే వారి సమస్యను పరిష్కరించి సాయంత్రానికి కలెక్టర్ భూమి పట్టాను ఆ కుటుంబానికి అందించారు.