ఈసీఐఎల్ కొటక్ మహింద్రా బ్యాంకు ఏటిఎం లో చోరీకి పాల్పడిన ఇంటి దొంగను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. ఏటీఎం లో నగదు పెట్టే ఓ సంస్థకు చెందిన ఉద్యోగి ఈ చోరీకి పాల్పడ్డాడు. తన దగ్గరు ఉన్న ఏటిఎం తాళంతో మిషన్ ను తెరిచి డబ్బులు తీసుకుని మళ్లీ యదావిదిగా మిషన్ కు తాళం వేసి వెళ్లిపోయాడు. అయితే ఏటిఎం లో సిసి కెమెరాలు ఉంటాయన్న చిన్న విషయాన్ని మరిచి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

వరంగల్‌ జిల్లా జనగామకు చెందిన తుడి విఘ్నేష్‌ అనే యువకుడు గత 15 ఏళ్లుగా సీఎంఎస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడు ఈ సంస్థ ఆద్వర్యంలోని ఎటీఎం యంత్రాల్లో డబ్బులు పెడుతుంటాడు. సంస్థలో సీనియర్ ఉద్యోగైన విఘ్నేష్ ఎంతొ నమ్మకంగా ఉండేవాడు.

ఇతడు ఈనెల 9 వ తేదీన రాత్రి 11:50 గంటలకి ఈసీఐఎల్‌ కమలానగర్‌లోని కొటక్‌ మహేంద్ర బ్యాంకు ఏటీఎం లో చోరీకి పాల్పడ్డాడు. అతడి వద్ద ఉన్న తాళంచెవితో ఏటీఎం యంత్రాన్ని తెరిచి అందులోని రూ.3.54 లక్షల నగదును ఎత్తుకెళ్లాడు. ఆ తర్వాత కూడా ఎవరికీ అనుమానం రాకుండా ఉద్యోగానికి వెళుతున్నాడు.

అయితే ఈ ఏటీఎం లో డబ్బులు పెట్టడానికి వెళ్లిన ఉద్యోగి నగదు తక్కువగా ఉండడాన్ని గుర్తించాడు. ఈ విషయాన్ని తమ సంస్థ ఉన్నతాధికారులకు తెలియజేశాడు. దీంతో ఎటీఎం సెంటర్లోని సిసి కెమెరాను పరిశీలించగా దొంగ బైటపడ్డాడు.

అధికారుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కుషాయిగూడ పోలీసులు నిందితుడు విఘ్నేష్ ను అరెస్ట్ చేశారు. అతడి నుండి రూ.3.54 లక్షల నగదును స్వాధీనం చేసుకొని రిమాండ్‌కు తరలించారు.