Asianet News TeluguAsianet News Telugu

కేసీఆర్ కోలుకోవాలి.. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడాలి- సీఎం రేవంత్ రెడ్డి.. హాస్పిటల్ లో పరామర్శ..

మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి హాస్పిటల్ లో పరామర్శించారు. ఆయన ఆరోగ్యంపై మాజీ మంత్రులు కేటీఆర్ హరీశ్ రావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ త్వరగా కోలుకొని ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట్లాడాలని ఆకాంక్షించారు.

CM Revanth Reddy visited KCR in hospital..ISR
Author
First Published Dec 10, 2023, 1:13 PM IST

తుంటి ఎముక విరిగిపోవడంతో హైదరాబాద్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ను ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ కు కొంత సమయం క్రితమే చేరుకొని పరామర్శించారు. ఆయన వెంట మంత్రులు సీతక్క, షబ్బీర్ అలీ ఉన్నారు. 

జూబ్లీహిల్స్ నివాసం నుంచి బయలుదేరి హాస్పిటల్ కు చేరుకున్న సీఎం, మంత్రులకు హాస్పిటల్ సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం 9వ అంతస్తుకు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి కేటీఆర్, సీఎం రేవంత్ రెడ్డిని రిసీవ్ చేసుకున్నారు. అనంతరం కేసీఆర్ తో కాసేపు మాట్లాడారు. త్వరగా కోలుకోవాలని, అసెంబ్లీ సమావేశాలకు వచ్చి తెలంగాణ ప్రజా సమస్యలపై మాట్లాడాలని ఆయన ఆకాంక్షించారు.

అనంతరం అక్కడే ఉన్న కేసీఆర్ భార్య శోభ, కేటీఆర్, హరీశ్ రావు లతో కాసేపు మాట్లాడారు. తరువాత బయటకు వచ్చి మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎంను పరామర్శించానని తెలిపారు. త్వరగా కోలుకొని అసెంబ్లీ సమావేశాలకు రావాలని, తెలంగాణ ప్రజా సమస్యలపై మాట్లాడాలని కేసీఆర్ ను కోరినట్టు చెప్పారు. ఆయన కోలుకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్యంపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సహకారాలు అందిస్తామని చెప్పారు. 

కాగా..  అంతకు ముందే మంత్రి పొన్నం ప్రభాకర్ హాస్పిటల్ కు చేరుకున్నారు. అయితే పలు కారణాల వల్ల ఆయనను సీఎం కేసీఆర్ దగ్గరికి వెళ్లలేకపోయారు. దీంతో అక్కడే ఉన్న మాజీ మంత్రి హరీశ్ రావు, కేటీఆర్, కొత్త ప్రభాకర్ రెడ్డి లను కలిసి మాట్లాడారు. కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించిన పలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios