కేసీఆర్ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. కాంగ్రెస్ పాలనే తెలంగాణకు శ్రేయస్కరం అని, కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని దోచుకుందని ఆరోపించారు. ప్రభుత్వ సహకారంతోనే బిఆర్ఎస్ సభ విజయవంతమైందని, తామెలాంటి పథకాలు నిలిపివేయలేదని, కేసీఆర్ ఫామ్‌హౌస్‌కే పరిమితమవుతారని వ్యాఖ్యానించారు.

Revanth Reddy : వరంగల్ వజ్రోత్సవ సభలో బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఆనాటి నుండి ఈనాటి వరకు తెలంగాణకు కాంగ్రెస్సే విలన్ అంటున్నారు... ప్రస్తుతం తెలంగాణ ఆగమవుతోందన్న కేసీఆర్ కామెంట్స్ పై రేవంత్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ఇచ్చినందుకే కాంగ్రెస్ విలన్ అయ్యిందా? మరో పదేళ్లు దోచుకోవడం ఆగిందనే తెలంగాణ ఆగమయ్యిందా? అంటూ నిలదీసారు. 

కేసీఆర్ ఏం చేసినా పదేళ్లపాటు తెలంగాణను పాలించేది కాంగ్రెస్సే... కేసీఆర్ ఫార్మ్ హౌస్ కే పరిమితం అవుతాడని సీఎం రేవంత్ అన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపుకు అప్పగించినట్లు గత పదేళ్ల పాలన సాగింది... కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 

ప్రభుత్వ సహకారంతోనే బిఆర్ఎస్ రజతోత్సవ సభ సక్సెస్ అయ్యిందని సీఎం రేవంత్ అన్నారు. సభ ఏర్పాట్ల నుండి బస్సుల్లో ప్రజల తరలింపు వరకు బిఆర్ఎస్ శ్రేణులకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందించింది... కేసీఆర్ పాలనలో ఇలా ఎప్పుడైనా ప్రతిపక్షాలకు వెసులుబాటు కల్పించారా? అని నిలదీసారు. 

Scroll to load tweet…

ఏ పథకాలు నిలిపివేసాం కేసీఆర్ : రేవంత్ రెడ్డి 

కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలను ఆపుతోందని కేసీఆర్ అంటున్నాడు... ఏ పథకాలు ఆగాయో చెప్పాలన్నారు సీఎం రేవంత్. రైతుబంధు, కళ్యాణలక్ష్మి, షాది ముబారక్, ఫీజు రియింబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ,, ఉచిత విద్యుత్.... ఏ పథకం ఆపలేదని రేవంత్ గుర్తుచేసారు. ఈ పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను అమలుచేస్తున్నామని... పెట్టుబడులు తెచ్చి, ఉద్యోగాల ఇచ్చి రాష్ట్రాన్ని మరింత ముందుకు తీసుకెళుతున్నామని రేవంత్ అన్నారు.

ఎన్నికల హామీలు అమలుచేసే ప్రయత్నం చేస్తున్నామని రేవంత్ రెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పాలనలో సంపాదించిన వందల కోట్ల డబ్బులు ఫాంహౌస్‌లు ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటూ విధులు నిర్వర్తించకపోవడం ఎలా సమర్థించుకుంటారు..? అని ప్రశ్నించారు. జీతాలు తీసుకుని పనిచేయకపోవడం ఏ చట్టంలో ఉంది?.. ప్రతిపక్ష బాధ్యత నిర్వర్తించకుండా ఫాంహౌస్‌లో ఎందుకు పడుకుంటున్నారు? అసెంబ్లీకి రాను.. పిల్లల్ని పంపిస్తా అంటే మరి మీరెందుకు ప్రతిపక్ష నాయకుడిగా ఉండటం? అని సీఎం రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. 

ప్రతిపక్ష నేతగా అసెంబ్లీలో ఉండాల్సిన మీరు ఫౌంహౌస్‌లో పడుకుని ఏం సందేశం ఇస్తున్నారు..? అధికారంలో ఉంటే చెలాయిస్తాం... లేదంటే అసెంబ్లీకి రాను అంటే ఎట్లా? అని అడిగారు. కేసీఆర్ విద్వేషపూరిత ప్రసంగం చేసి ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాడని సీఎం రేవంత్ మండిపడ్డారు.