న్యూసిటీ, ఓల్డ్ సిటీ అన్న తేడా కాంగ్రెస్‌కు లేదు .. పదే పదే బీఆర్ఎస్‌ను పొగడొద్దు : ఎంఐఎంకు రేవంత్ చురకలు
తెలంగాణలో అసెంబ్లీలో విద్యుత్ బిల్లుల బకాయిలపై వాడివేడి చర్చ జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ వుంటే వినేందుకు తాము సిద్ధంగా లేమని రేవంత్ తేల్చిచెప్పారు. మా ప్రాంతంలో వున్న విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత వహిస్తామని ఎందుకు చెప్పరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.
తెలంగాణలో అసెంబ్లీలో విద్యుత్ బిల్లుల బకాయిలపై వాడివేడి చర్చ జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ.. విద్యుత్ బిల్లుల ఎగవేత విషయంలో సిద్ధిపేట మొదటి స్థానంలో వుండగా.. రెండు, మూడు స్థానాల్లో గజ్వేల్, హైదరాబాద్ సౌత్ వున్నాయని రేవంత్ రెడ్డి వెల్లడించారు. సిద్ధిపేట, గజ్వేల్, హైదరాబాద్ సౌత్ నుంచి గెలిచిన వారే గత పదేళ్లుగా తెలంగాణను పాలించారని ఆయన చురకలంటించారు.
బీఆర్ఎస్, ఎంఐఎం వేరు వేరు కాదని.. ఇద్దరూ కలిసే రాష్ట్రాన్ని పాలించారని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు. మైనారిటీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి వుందని .. ఓల్డ్ సిటీ, న్యూసిటీ అనే తేడా మాకు లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అదే పనిగా ఎంఐఎం పొగుడుతూ వుంటే వినేందుకు తాము సిద్ధంగా లేమని రేవంత్ తేల్చిచెప్పారు.
ఎంఐఎం కేసీఆర్‌ను రక్షించే పని ఎందుకు చేస్తోందని సీఎం ప్రశ్నించారు. హైదరాబాద్ సౌత్‌లో 61 శాతం బకాయిలు వున్నాయని.. బీఆర్ఎస్ , మజ్లిస్ మిత్రులని కేసీఆర్ చెప్పారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. కామారెడ్డిలో షబ్బీర్ అలీని ఓడించడానికి అక్బర్, కేసీఆర్‌తో కలిసి పనిచేశారని .. కవ్వంపల్లి లాంటి దళిత ఎమ్మెల్యేను అవమానించడం ఎంఐఎంకు తగదని సీఎం హితవు పలికారు. మా ప్రాంతంలో వున్న విద్యుత్ బకాయిలు చెల్లించే బాధ్యత వహిస్తామని ఎందుకు చెప్పరని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. జగదీష్ రెడ్డి కరెంట్ కోసం ఆందోళనలు జరగలేదని చెబుతున్నారని.. కామారెడ్డి, సూర్యాపేటలలో 24 గంటలు కరెంట్ ఇవ్వలేదని రైతులు ఆందోళన చేశారని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
అక్బరుద్దీన్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారని.. ఆయన అనుభవాన్ని పరిగణనలోనికి తీసుకుని ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. అక్బరుద్దీన్ మజ్లిస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే మాత్రమేనని.. ముస్లిలందరికీ నాయకుడు కాదని సీఎం పేర్కొన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ సొరంగం బ్లాస్ట్ అయ్యి 9 మంది చనిపోయారని.. ఈ ఘటనలో ఏఈ ఫాతిమా చనిపోయిందని ముఖ్యమంత్రి చెప్పారు.
మైనార్టీలను ముఖ్యమంత్రులను, రాష్ట్రపతిని చేసింది కాంగ్రెస్సేనని.. మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్ ఇచ్చింది మేమేనని ఆయన వెల్లడించారు. ఎంఐఎంకు కేసీఆర్ మిత్రుడు కావొచ్చు, మోడీకి మద్ధతు ఇవ్వొచ్చునని వాళ్ల ఇష్టమని రేవంత్ రెడ్డి చురకలంటించారు. కేసీఆర్.. సిరిసిల్ల, సిద్ధిపేట నుంచి ఎందుకు పోటీ చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్‌కి టికెట్ ఇస్తే మజ్లిస్ ఓడించే ప్రయత్నం చేసిందని రేవంత్ రెడ్డి ఆరోపించారు.