Asianet News TeluguAsianet News Telugu

రేవంత్ రెడ్డి  సంచలన నిర్ణయం.. మరో రెండు గ్యారెంటీలు అమలు.. 

CM Revanth reddy: ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారంటీలు అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రానున్న బడ్జెట్లోనే వాటికి నిధుల కేటాయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.  

CM Revanth reddy says Two more guarantees to be implemented immediately KRJ
Author
First Published Feb 2, 2024, 12:40 AM IST

CM Revanth reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎన్నిక ప్రచారంలో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో భాగంగా మరో రెండు గ్యారంటీలను అమలు చేద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులందరికీ లబ్ధి జరిగేలా గ్యారంటీలను అమలు చేస్తామనీ, మరో రెండు గ్యారంటీల అమలుకు సన్నాహాలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజాపాలన దరఖాస్తులపై  గురువారం నాడు డా. బి. ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కేబినేట్ సబ్ కమిటీ మంత్రులు, ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సమావేశంలో ప్రధానంగా రూ.500కు గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు పథకాలపై సంబంధిత అధికారులతో చర్చించారు. ఈ మూడు గ్యారంటీల అమలుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వీటిలో రెండింటిని తక్షణమే అమలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని సీఎం చెప్పారు. ఒక్కో గ్యారంటీ అమలుకు ఎంత ఖర్చవుతుంది?  ఎంత మందికి లబ్ధి కలుగుతుందనే వివరాలను తెలుసుకున్నారు. ఈ బడ్జెట్ లోనే ఆ హామీల అమలుకు అవసరమైన నిధులు కేటాయించాలని సీఎం ఆర్థిక శాఖకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల్లోపు మరోసారి కేబినేట్ సబ్ కమిటీతో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు.   

రాష్ట్రవ్యాప్తంగా గత ఏడాది డిసెంబర్ 28 నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రభుత్వం ప్రకటించిన అయిదు గ్యారంటీలకు అర్హులైన వారందరి నుంచి గ్రామసభలు, వార్డు సభల ద్వారా  దరఖాస్తులను స్వీకరించారు. అయిదు గ్యారంటీలకు మొత్తం 1,09,01,255 దరఖాస్తులు నమోదయ్యాయి. జనవరి 12వ తేదీ నాటికే వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ రికార్డు సమయంలో పూర్తి చేసినట్లు అధికారులు సీఎంకు నివేదించారు. 

వచ్చిన దరఖాస్తుల్లో కొందరు ఒకే పేరుతో రెండు మూడు దరఖాస్తులు ఇచ్చారని, కొన్నింటికి ఆధార్, రేషన్ కార్డు నెంబర్లు లేవని అధికారులు వివరించారు. అలాంటి దరఖాస్తులను మరోసారి పరిశీలించాలని, అవసరమైతే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన జరపాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. అర్హులైన వారెవరూ నష్టపోకుండా ఒకటికి రెండు సార్లు సరి చూడాలని కోరారు. దరఖాస్తుల్లో తప్పులుంటే వాటిని  సరిదిద్దుకునేందుకు ఎంపీడీవో ఆఫీసుల్లో లేదా తదుపరి నిర్వహించే ప్రజా పాలన కార్యక్రమంలో మరోసారి అవకాశమిచ్చే ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు. గ్యారంటీల అమలుకు లేని పోని నిబంధనలు పెట్టి ఎవరినీ ఇబ్బంది పెట్టవద్దని చెప్పారు. దరఖాస్తు చేసిన వారిలో అర్హులైన వారందరూ లబ్ధి పొందేలా చూడాలని అన్నారు. దరఖాస్తు చేయని వారుంటే.. నిరంతర ప్రక్రియగా మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పించాలని సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంబంధిత ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios