ఆస్తుల్లో వాటా తేల్చే పనిలో రేవంత్ రెడ్డి .. ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
ఢిల్లీ పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో చర్చించారు.
తెలంగాణ ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి దూకుడు పెంచారు. ఇప్పటికే తన పాలనను గాడిలో పెట్టేందుకు గాను తన టీమ్‌ను సిద్ధం చేసుకున్నారు. తాజాగా విభజన సమస్యలపై ఆయన ఫోకస్ పెట్టారు. ఢిల్లీ పర్యటనలో వున్న రేవంత్ రెడ్డి.. ఉమ్మడి ఆస్తుల్లో తెలంగాణ వాటా, నూతన భవనాల నిర్మాణంపై తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ గౌరవ్ ఉప్పల్, తెలంగాణ భవన్ ఓఎస్డీ సంజయ్ జాజులతో చర్చించారు. తెలంగాణ భవన్ మొత్తం విస్తీర్ణం, అందులోని భవనాలు , వాటి స్థితిగతులు, విభజన చట్టం ప్రకారం తెలంగాణకు రావాల్సిన వాటాపై ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఉమ్మడిగా 19.78 ఎకరాల భూమి వుందని అధికారులు సీఎంకు వివరించారు. ఉమ్మడి భవన్ పరిధిలోని 8.781 ఎకరాల్లో శబరి బ్లాక్, అంతర్గత రహదారులు, గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టళ్లు, పటౌడీ హౌస్ వున్నట్లు అధికారులు రేవంత్ రెడ్డికి వివరించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 8.245 ఎకరాలు.. ఏపీకి 11.536 ఎకరాలు వస్తుందని ముఖ్యమంత్రికి తెలిపారు. అయితే దాదాపు 40 ఏళ్లు కావొస్తుండటంతో భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని అధికారులు వివరించారు. దీనిపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త భవనం నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఆస్తులపై ముందు దృష్టి సారించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు.
అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో వున్నప్పుడు ఏపీ భవన్ విభజనపై కేంద్రం పలుమార్లు చర్చలు జరిపింది. ఈ సందర్భంగా ప్రస్తుతం ఉన్న ఏపీ భవన్ ఏపీకే చెందుతుందని, ఖాళీగా వున్న స్థలాన్ని తెలంగాణ తీసుకోవాలని కేంద్ర హోంశాఖ ప్రతిపాదించింది. పటౌడీ హౌస్ 7.64 ఎకరాలు తెలంగాణకు ఇవ్వాలని.. శబరి బ్లాక్ , గోదావరి బ్లాక్, నర్సింగ్ హాస్టల్స్ వున్న 12.9 ఎకరాల ప్రదేశాన్ని ఆంధ్రప్రదేశ్‌కు ఇవ్వాలని సూచించింది. రెండు రాష్ట్రాల మధ్య వున్న జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఈ విభజన వుంటుందని కేంద్రం పేర్కొంది. అయితే ఈ ప్రతిపాదనకు ఏపీ సర్కార్ అంగీకరించగా, తెలంగాణ నో చెప్పింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి దూకుడు నేపథ్యంలో ఏపీ భవన్ విభజన పూర్తయ్యే అవకాశం వుంది.