Asianet News TeluguAsianet News Telugu

సీఎం రేవంత్ సొంతూరు మహిళకు ప్రభుత్వోద్యోగం, ఐదెకరాల భూమి... ఎవరీ సుమతమ్మ? 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లికి చెందిన ఓ కుటుంబానికి భారీ సాయం అందింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఆ కుటుంబ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 

CM Revanth Own Village Women got Government job and Agriculture Land AKP
Author
First Published Apr 3, 2024, 8:16 PM IST

నాగర్ కర్నూల్ : తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి గొప్పమనసు చాటుకున్నారు. ఎప్పుడో పదేళ్లకింద తన స్వగ్రామం కొండారెడ్డిపల్లెకు చెందిన జవాన్ దేశ రక్షణకోసం తన ప్రాణాలు విడిచిన విషయాన్ని రేవంత్ గుర్తుపెట్టుకున్నారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన సదరు జవాన్ కుటుంబాన్ని ముఖ్యమంత్రి రేవంత్ ఆదుకున్నారు. ఈ సందర్భంగా ఆ కుటుంబం రేవంత్ ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
 
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గ పరిధిలోని కొండారెడ్డిపల్లె ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ స్వగ్రామం. ఇక్కడే పుట్టిపెరిగిన రేవంత్ కు ఈ ప్రాంతంతో, ఇక్కడి మనుషులతో విడదీయరాని సంబంధం వుంది. దీంతో ఇక్కడి ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఆయన ఆదుకోవడంలో ముందుంటారు. ఇలా వీరమరణం పొందిన ఓ ఆర్మీ జవాన్ కుటుంబానికి అండగా నిలిచారు. 
 
ఎవరీ సుమతమ్మ? 

వంగూరు మండలం కొండారెడ్డిపల్లె గ్రామానికి చెందిన మల్లెపాకుల యాదయ్య ఇండియన్ ఆర్మీలో పనిచేసేవాడు. దేశ రక్షణ విధుల్లో వుండగా అతడు వీరమరణం పొందాడు. 2013లో జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ వద్ద ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనాలపై ఉగ్రదాడి జరిగింది. ఇందులో తెలంగాణకు చెందిన యాదయ్య ప్రాణాలు కోల్పోయాడు. 

ఇంటి పెద్దదిక్కును కోల్పోయిన జవాన్ యాదయ్య కుటుంబానికి ఆనాటి ప్రభుత్వం సాయం చేసింది. భర్త మరణంతో ఇద్దరు ఆడబిడ్డల పోషణభారం సుమతమ్మపై పడింది. ఆమెకు ప్రభుత్వం రూ.5 లక్షల రూపాయలు, కల్వకుర్తిలో 165 గజాల ఇంటి స్థలాన్ని అందించింది. కొంత పెన్షన్ డబ్బులు కూడా వస్తుండటంతో కుటుంబాన్ని పోషించుకుంటూ వస్తోంది సుమతమ్మ. 

జవాన్ యాదయ్య కుటుంబానికి మరింత సాయం చేయాలని ఆనాడే రేవంత్ ప్రభుత్వానికి లేఖ రాసారు. కానీ ప్రభుత్వం రేవంత్ అభ్యర్థనను పట్టించుకోలేదు. దీంతో ఇక సుమతమ్మ కుటుంబం కూడా చాలీచాలని ఆర్థికసాయం, పెన్షన్ డబ్బులతోనే సరిపెట్టుకుంది... ఇక తమ బ్రతుకులు ఇంతేనని సరిపెట్టుకున్నారు.  

సుమతమ్మకు రేవంత్ సర్కార్ సాయం : 

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించి రేవంత్ ముఖ్యమంత్రి అయ్యారు. ఇలా గతంలో తాను సాయం చేయాలని కోరిన యాదయ్య కుటుంబానికి స్వయంగా తానే సాయంచేసే అవకాశం వచ్చింది. దీంతో వెంటనే తన స్వగ్రామానికి చెందిన జవాన్ యాదయ్య భార్యకు ఉద్యోగం కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం. దీంతో వెంటనే నాగర్ కర్నూల్ కలెక్టర్ సుమతమ్మకు రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా నియమించారు. చారగొండ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టింంగ్ ఇచ్చారు.  అంతేకాదు సీఎం ఆదేశాలతో ఆమెకు ఐదు ఎకరాల భూమిని కూడా ప్రభుత్వం కేటాయించింది. ఇలా వీరజవాన్ కుటుంబానికి ఏ లోటు రాకుండా సాయం అందించారు ముఖ్యమంత్రి రేవంత్.  

యాదయ్య భార్యకు ప్రభుత్వ ఉద్యోగం, ఐదెకరాల భూమిని కేటాయించినట్లు అధికారిక ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలోనే సుమతమ్మ తన ఇద్దరు బిడ్డలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు. తనను కలిసి సుమతమ్మ కుటుంబానికి ఐదెకరాల భూమికి సంబంధించిన పట్టా పాస్ బుక్ అందజేసారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా ఆ తల్లీకూతుళ్ల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.


 

Follow Us:
Download App:
  • android
  • ios