తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యదాద్రి భువనగిరి జిల్లాలో (Yadadri Bhuvanagiri District) పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR).. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం యదాద్రి భువనగిరి జిల్లాలో (Yadadri Bhuvanagiri District) పర్యటించనున్నారు. తన పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ (CM KCR).. మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రికి చేరుకుంటారు. అక్కడ ప్రెసిడెన్షియల్‌ సూట్స్‌ను, వీవీఐపీ కాటేజీలను ప్రారంభిస్తారు. యాదాద్రిలో నిర్మిస్తోన్న యాగశాలను పరిశీలించనున్నారు. అనంతరం ఆయన భువనగిరికి చేరుకుంటారు. భువనగిరి శివారులోని రాయగిరిలో నూతనంగా నిర్మించిన జిల్లా సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. జిల్లా అభివృద్ధిపై అధికారులతో సమీక్షిస్తారు. 

ఆ తర్వాత యాదాద్రి భువనగిరి జిల్లా టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభింస్తారు. సాయత్రం 4 గంటలకు రాయగిరిలో నిర్వహించనున్న బహిరంగ సభలో కేసీఆర్​ పాల్గొననున్నారు. సభ అనంతరం కేసీఆర్.. తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారు. సీఎం పర్యటన నేపథ్యంలో మంత్రి జగదీష్‌రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. జిల్లా అధికారులు ఇప్పటికే సీఎం పర్యటనుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్​ సభకు సుమారు లక్షా పది వేల మంది వస్తారని టీఆర్ఎస్ శ్రేణులు అంచనా వేస్తున్నాయి

ఇక, సీఎం కేసీఆర్ ఈ నెల 7వ తేదీన యాదాద్రి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. 

ఇక, శుక్రవారం జనగామ జిల్లాలో పర్యటించిన కేసీఆర్.. అక్కడి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో నిప్పులు చెరిగారు. దేశ రాజకీయాల్లో పాత్ర పోషించాల్సి వస్తే కొట్లాడ్డానికి సిద్ధమని.. సిద్ధిపేట వాళ్లు పంపిస్తే తెలంగాణ సాధించామని సీఎం కేసీఆర్ (kcr) అన్నారు. తెలంగాణ ప్రజలు పంపిస్తే ఢిల్లీ గోడలు బద్ధలు కొడతామని.. ఖబడ్దార్ మోడీ అంటూ సీఎం హెచ్చరించారు. మమ్మల్ని ముట్టుకుంటే అడ్రస్ లేకుండా చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. దేశం నుంచి మోదీని తరిమేస్తామని.. మాకిచ్చే వాళ్లని తెచ్చుకుంటామని సీఎం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

బీజేపీ నేతలు తమ జోలికి వస్తే నాశనం చేస్తామని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. నరేంద్ర మోడీ జాగ్రత్త.. నీ ఊడుత ఊపులకు భయపడమన్నారు. అంతేకాకుండా తాము అధికారంలోకి వచ్చాక తెలంగాణలో జరిగిన అభివృద్దిని ఆయన వివరించారు. జనగామ జిల్లాపై వరాలు కురిపించారు. ఈ సభలో కేంద్రంపై విరుచుకుపడిన కేసీఆర్​.. నేడు రాయగిరిలో జరిగే బహిరంగ సభలో కేంద్రంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది.