మంత్రులకు సీఎం కేసీఆర్ సీరియస్ వార్నింగ్ శాఖలపై పట్టు పెంచుకోకపోతే ఇంటికే...

బుగ్గకారులో తిరగడం కాదు బుర్రపెట్టి పనిచేయండంటూ సీఎం కేసీఆర్ మంత్రులకు హెచ్చరికలు జారీ చేశారు. రెండున్నరేళ్లు గడుస్తున్నా ఇంకా శాఖల మీద పట్టులేని కొందరు మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

గత గురువారం తెలంగాణ కెబినెట్ భేటీ అయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో సీఎం కేసీఆర్ మంత్రుల పనితీరుపై కాసేపు క్లాస్ తీసుకున్నారు.

ప్రభుత్వం కొలువుదీరిన కొత్తలోనే సీఎం కేసీఆర్ ఏకంగా డిప్యూటీ మంత్రిగా ఉన్న రాజయ్యను ఇంటికి పంపారు.

పనిలో అలసత్వంతో పాటు అవినీతి ఆరోపణలొచ్చిన కొందరు మంత్రుల శాఖలను కూడా కట్ చేశారు. మెరుగైన పనితీరు కనబర్చిన మరికొందరికి అదనంగా మంత్రిత్వశాఖలు అప్పగించారు.

ఇంటలిజెన్స్ రిపోర్టు తో పాటు స్వయంగా మంత్రుల పనీతీరును మదింపు చేస్తున్న సీఎం కేసీఆర్ ఆరోపణలు వచ్చిన మంత్రులను తన చాంబర్ కు పిలిపించి గట్టిగానే క్లాసు తీసుకుంటున్నారు.

అయితే కెబినెట్ భేటీలో ఇలా బహిరంగంగా మంత్రుల పనితీరుపై సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదే మొదటిసారి.

ముఖ్యంగా గతంలో పనితీరు బాగాలేదని శాఖను మార్చిన మంత్రిపైనే సీఎం ఎక్కువగా అసంతృప్తి వ్యక్తం చేశారట. ఇన్నాళ్లైనా పనిలో అదే అలసత్వం ప్రదర్శించడం సరికాదని సూచించారట.

మన ప్రభుత్వం ఒక వైపు సంక్షేమరంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తుంటే ఆ శాఖల మంత్రులు మాత్రం ఆశించినస్థాయిలో పనిచేయడం లేదని సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారట.

తమ శాఖలపై పట్టుపెంచుకోని మంత్రులపై ఇక నుంచి కర్కశంగా వ్యవహరిస్తానని కెబినెట్ లోనే హెచ్చరికలు జారీ చేశారట.

ఇంతకీ సీఎం క్లాస్ తీసుకున్న మంత్రులు ఎవరు అనేది బయటకు రాలేదు. కానీ, గత రెండు రోజుల నుంచి ఆరు శాఖల మంత్రలు మాత్రం కాస్త సీరియస్ గానే తమ శాఖల పనితీరుపై సమీక్షలు చేస్తున్నారు.