తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం కరీంనగర్‌లో పర్యటించారు. ఇటీవల మంత్రి గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య మృతిచెందడంతో వారి కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శించారు. గంగుల క‌మ‌లాక‌ర్ తండ్రి గంగుల మ‌ల్ల‌య్య కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. ఆ సమయంలో మల్లయ్య మృతిపట్ల కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. ఆయ‌న ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ప్రార్థించారు.

అయితే ఈ రోజు ఉదయం హైదరాబాద్ నుంచి కరీంనగర్ చేరుకున్న కేసీఆర్.. కొండా సత్యలక్ష్మి గార్డెన్స్‌లో జరుగుతున్న గంగుల కమలాకర్ తండ్రి మల్లయ్య దశదినకర్మ కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ మల్లయ్య చిత్రపటానికి నివాళులర్పించారు. గంగుల కమలాకర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతర కేసీఆర్ హైదరాబాద్‌కు తిరుగుపయనమయ్యారు. 

ఇక, సీఎం కేసీఆర్‌తో పాటు గంగుల కుటుంబాన్ని పరామర్శించినవారిలో మంత్రులు కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్, తెలంగాణ ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, మనోహర్ రెడ్డి, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ ఎల్ రమణ తదితరులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ పర్యటన నేపథ్యంలో కరీంనగర్ పోలీసులు, అధికారులు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జ‌ర‌గ‌కుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.