Asianet News TeluguAsianet News Telugu

నేడు కలెక్టర్లతో సీఎం కేసీఆర్‌ విస్తృతస్థాయి సమావేశం.. దళిత బంధుపై కీలక ప్రకటన..?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేడు జిల్లా కలెక్టర్లతో భేటీ (meeting with Collectors) కానున్నారు. ద‌ళిత బంధు పథకం (Dalit Bandhu Scheme) ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగనున్నట్టుగా సమాచారం. ఈ సమావేశంలో కలెక్టర్లతో పాటుగా మంత్రులు కూడా పాల్గొననున్నారు. 

CM KCR to hold review meeting with Collectors Dalit Bandhu Scheme
Author
Hyderabad, First Published Dec 18, 2021, 9:41 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) నేడు జిల్లా కలెక్టర్లతో భేటీ (meeting with Collectors) కానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ప్రగతిభవన్‌లో ఈ విస్తృతస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు మంత్రులు కూడా పాల్గొననున్నారు. ద‌ళిత బంధు పథకం (Dalit Bandhu Scheme) ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం సాగనున్నట్టుగా సమాచారం. దళితబంధుతోపాటు ధాన్యం సేకరణ, ప్రభుత్వ పథకాల అమలు, రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితి, వ్యాక్సినేషన్‌, పోడు భూముల సమస్యలపై విస్తృతంగా చర్చించనున్నారు. 

ప్రత్యామ్నాయ పంటలు వేయడంపై రైతుల్లో అవగాహన కల్పించడం, యాసంగి పంటల సాగు, జిల్లాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం కేసీఆర్ ఈ సమావేశంలో చర్చించనున్నారు. వీటిపై కార్యాచరణ ఖరారు చేయనున్న కేసీఆర్.. కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పల్లెప్రగతి, మెడికల్‌ కాలేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు, కార్యాచరణ ఖరారు చేసి కలెక్టర్లకు మార్గనిర్దేశం చేస్తారు. పల్లెప్రగతి, మెడికల్‌ కాలేజీలు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సెజ్‌లు, పట్టణప్రగతి, హరితహారం, ధరణి సమస్యల వంటి అంశాలు చర్చకు రానున్నాయి.

దళిత బంధుపై కీలక ప్రకటన..?
ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో దళిత బంధు పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దళిత బంధు పథకం నిధులను యాదాద్రి జిల్లా వాసాల‌మ‌ర్రిలో ప‌లువురికి పంపిణీ కూడా చేశారు. హుజురాబాద్‌లో పైలట్ ప్రాజెక్టుగా తీసుకొచ్చారు. ఇక్కడ బహిరంగ సభ నిర్వహించిన కేసీఆర్.. దశల వారీగా అమలు చేస్తామని వెల్లడించారు. ఆ తర్వాత దళిత బంధు అమలుకు ఖ‌మ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింత‌కాని మండ‌లం, సూర్యాపేట జిల్లా తుంగ‌తుర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని తిరుమ‌ల‌గిరి మండ‌లం, నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజ‌క‌వ‌ర్గంలోని చారగొండ మండలం, కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగ‌ర్ మండ‌లాలను పథకం అమలు కోసం ఎంపిక చేశారు. 

Also read: Rythu Bandu Scheme : వరి వేసినా సరే ...‘‘రైతు బంధు’’ : కేసీఆర్ సంచలన నిర్ణయం

అయితే ఆ తర్వాత హుజురాబాద్‌లో ఉప ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఈసీ పథకం అమలుకు బ్రేక్ వేసింది. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్తికాగానే నవంబర్ 4వ తేదీ నుంచి దళిత బంధును యథావిథిగా అమలు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే ఉప ఎన్నిక ముగిసి 45 రోజులు గడుస్తున్న దళిత బంధు అమలు ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో.. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. 

ఈ క్రమంలోనే శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో దళిత బంధుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని పార్టీ శ్రేణులతో చెప్పారు.  దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని,  వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారికి మార్గనిర్దేశనం చేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే కేసీఆర్.. నేడు జరగనున్న విస్తృత స్థాయి సమావేశంలో కలెక్టర్లు, మంత్రులతో దళిత బంధుపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై కలెక్టర్లకు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios