హైదరాబాద్: నాగార్జునసాగర్  అసెంబ్లీ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి నోముల భగత్ తరపున సీఎం కేసీఆర్  ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.ఈ నెల 14వ తేదీన హలియాలో నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొంటారు.ఈ నెల 17వ తేదీన  నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఉప ఎన్నికల్లో ప్రచారం  నెల 15 వ తేదీతో  ముగియనుంది. దీంతో ప్రచారానికి తెరపడడానికి ఒక్క రోజు ముందే  ఎన్నికల సభలో  సీఎం కేసీఆర్ పాల్గొంటారు.

ఈ ఏడాది ఫిబ్రవరి మాసంలో హలియాలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ ఎన్నికల సభలో  ఇప్పటికే సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు.నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో  విజయం సాధించడం కోసం ఆ పార్టీ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తోంది. రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయంతో రెట్టించిన ఉత్సాహంతో ఆ పార్టీ శ్రేణులు  ఈ ఉప ఎన్నికల్లో ప్రచారం నిర్వహిస్తున్నారు.

మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు మండలాల వారీగా బాధ్యతలను టీఆర్ఎస్ అప్పగించింది.