యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు (paddy procurement centres) ఉండవని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.
యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు (paddy procurement centres) ఉండవని సీఎం కేసీఆర్ (KCR) మరోసారి స్పష్టం చేశారు. జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ ప్రగతిభవన్‌లో శనివారం విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రత్యామ్నాయ, లాభసాటి పంటల దిశగా రైతులను మళ్లించాలని అధికారులకు సూచించారు. రైతుల్లో అవగాహన పెంచే బాధ్యతను అధికారులు తీసుకోవాలని అన్నారు. వచ్చే వానాకాలం పంటలపై కూడా ప్రణాళికలు సిద్దం చేయాలని ఆదేశించారు. వానాకాలంలో ముఖ్యంగా పత్తి, వరి, కంది సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు.
మరోవైపు ఈ సమావేశంలో రాష్ట్రంలో ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో (telangana) జరుగుతున్న ఉద్యోగుల విభజనపై కలెక్టర్లకు సీఎం కేసీఆర్ (KCR) కీలక ఆదేశాలు జారీచేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ప్రకారమే ఉద్యోగుల విభజన అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త జోనల్ వ్యవస్థ ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ కల్పన జరుగుతుందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లి పనిచేస్తేనే సమగ్రాభివృద్ది జరుగుతుందని తెలిపారు. 4,5 రోజుల్లో ఉద్యోగ విభజన ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ నిర్వహించాలని సూచించారు. విభజన పూర్తి చేసి నివేదిక తనకు ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించారు.
భార్యభర్తలు అయిన ఉద్యోగులు ఒకేచోట పనిచేస్తేనే వారు ప్రశాంతంగా ఉండగలరని, సమర్ధవంతంగా పనిచేయగలరని అభిప్రాయపడ్డారు. స్థానిక ఉద్యోగాలకు విఘాతం కలగకుండా స్పౌస్ కేసులను పరిగణలోకి తీసుకోవాలని చెప్పారు. ఇంకా మిగిలిన అంశాలపై కేసీఆర్.. కలెక్టర్లు, మంత్రులతో చర్చిస్తున్నారు.
దళిత బంధుపై కీలక ప్రకటన..?
ఈ సమావేశం అనంతరం రాష్ట్రంలో దళిత బంధు పథకంపై కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. శుక్రవారం తెలంగాణ భవన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో దళిత బంధుపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని పార్టీ శ్రేణులతో చెప్పారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని వారికి మార్గనిర్దేశనం చేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే కేసీఆర్.. విస్తృత స్థాయి సమావేశంలో కలెక్టర్లు, మంత్రులతో దళిత బంధుపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం ఉంది. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారులు కూడా పాల్గొననున్నారు. దళితబంధు పథకం అమలుపై అధికారులకు, ప్రజా ప్రతినిధులకు శిక్షణ ఇచ్చే అంశంపై కలెక్టర్లకు కేసీఆర్ పలు సూచనలు చేయనున్నారు.
