అధికారులకు కేసీఆర్ నిర్దేశం ఐదుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు నగద రహిత లావాదేవీలు ప్రోత్సహించాలని సూచన

నోట్ల రద్దు వల్ల సామాన్యులు పడుతున్న కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వ పరంగా కృషి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. భవిష్యత్‌లో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని సూచించారు. ప్రజల సమస్యలు పరిష్కరించేందుకు ఆర్థిక శాఖ కృషి చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

ఇవాళ ప్రగతి భవన్‌లో మంత్రులు, అధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టాల్సిన చర్యలపై ఆర్థిక శాఖ కార్యాచరణ రూపొందించాలి. ప్రజలకు అవగాహన కల్పించేలా బ్యాంకర్లతో కలెక్టర్లు మాట్లాడాలి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వం సహాయకారిగా ఉండాలి. 

నగదు రహిత లావాదేవీలు, ఈ చెల్లింపుల విధానాల రూపకల్పన కోసం ఐదుగురు ఐఏఎస్ అధికారులతో ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి కమిటీకి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారులు సురేశ్ చందా, నవీన్ మిట్టల్, జయేశ్ రంజన్, కలెక్టర్లు రఘునందన్, సురేంద్ర మోహన్ సభ్యులుగా ఉండనున్నారు. 

కలెక్టర్లు అనుసరించాల్సిన విధానంపై జాబ్ చార్టును రూపొందించాలని సీఎం కేసీఆర్ కమిటీని ఆదేశించారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పడే ప్రభావం తదితర అంశాలపై ఆర్థిక శాఖ కార్యదర్శి నివేదిక తయారు చేసి మంత్రులకు అందివ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు