తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు.
తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. సంబంధిత శాఖలను అప్రమత్తం చేయాల్సింది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌ను ఆదేశించారు. అన్ని జిల్లాల కలెక్టర్లతో సహా సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని, వరద ముంపు ప్రాంతాల్లో అధికారులను, ఎన్డీఆర్ఎఫ్, రెస్క్యూ బృందాలను అప్రమత్తం చేయాలన్నారు. తెలంగాణ వ్యాప్తంగా రెడ్ అలర్ట్ దృష్ట్యా పరిస్థితులు సమీక్షిస్తున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిస్థితులను బట్టి నేడో, రేపో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తానని తెలిపారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం ట్వీట్ చేసింది.
‘‘జిల్లాల్లో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల నాయకులు, ప్రజాప్రతినిధులు తమ తమ ప్రాంతాల ప్రజల రక్షణ నిమిత్తం అప్రమత్తంగా ఉండాలని సీఎం కేసీఆర్ సూచించారు. రక్షణ చర్యల్లో ప్రజలకు సాయపడుతూ, నష్టం జరగకుండా చూసుకోవలని ప్రజా ప్రతినిధులకు సీఎం పిలుపునిచ్చారు. భారీ వానలు, వరదల నేపథ్యంలో అనవసరంగా రిస్క్ తీసుకోవద్దని, అత్యవసరమైతేనే తప్ప ప్రజలు బయటకు రాకూడదని, స్వీయ నియంత్రణతో జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు.
గోదావరి, ప్రాణహిత నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున భారీ ఎత్తున వరదలు వస్తున్నాయని, ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ అధికారులను సీఎం అప్రమత్తం చేశారు.భారీ వర్షాల నేపథ్యంలో ఈనెల 11న ప్రగతి భవన్ లో నిర్వహించతలపెట్టిన మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ల ‘రెవెన్యూ సదస్సుల అవగాహన’ సమావేశంతో పాటు, 15వ తేదీనుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించ తలపెట్టిన ‘రెవెన్యూ సదస్సులను’ వాయిదా వేస్తున్నట్టు సీఎం తెలిపారు’’ అని సీఎంవో కార్యాలయం పేర్కొంది.
ఇక, తెలంగాణలో గత 48 గంటల్లో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం హైదరాబాద్‌లో కుండపోత వర్షం కురిసింది. శని, ఆదివారాల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ వార్నింగ్ జారీచేసింది. రాష్ట్రవ్యాప్తంగా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని.. కొన్ని ప్రదేశాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో రెండు రోజుల పాటు 20 సెంటీమీటర్ల వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాలు, నిర్మల్, నిజామాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ (రూరల్), వరంగల్ (అర్బన్) జిల్లాల్లో చాలా చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలకు చాలా చోట్లు నదులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. రిజర్వాయర్లలోకి కూడా వరద ప్రవాహం కొనసాగుతుంది.
