హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి ప్రజా సంబంధాల అధికారి (పీఆర్వో) ఘటిక విజయ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆయన వెల్లడించారు. వ్యక్తిగత కారణాల వల్ల తాను రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. 

ఉన్నతమైన స్థానంలో పనిచేయడానికి అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించినవారందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.

ఘటిక విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉంటున్నారు. చీఫ్ పీఆర్వో ఉన్నప్పటికీ కేసీఆర్ ప్రసంగాలను, మీడియా సమావేశాలను ఆయనే రికార్డు చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు కూడా. 

కేసీఆర్ మీద ఆయన ఓ గ్రంథం కూడా రాశారు. కేసీఆర్ కు మొదటి నుంచి చాలా సన్నిహితంగా ఉంటూ వస్తున్నారు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఘటనలను ఆయన రికార్డు చేశారు. 

ట్రాన్స్ కో జీఎంగా కూడా గటిక రాజీనామా!

ట్రాన్స్ కో జీఎంగా గటిక విజయ్ కుమార్ రాజీనామా చేసినట్లు ఆశాఖ ఉన్నతస్థాయి వర్గాలు వెల్లడించాయి. రెండు రోజుల క్రితం ఆయన తన రాజీనామా లేఖను సమర్పించగా ఒకరోజు తరవాత సంబంధిత ప్రాధికారి దాన్ని ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి.