సీఎం కేసీఆర్ చాలా రోజుల తర్వాత మరో పిట్ట కథతో ఆకట్టుకున్నారు.  

సమైక్య పాలనలో తెలంగాణకు జరుగుతున్న ద్రోహాన్ని పిట్టకథలతో వివరించి ప్రజలను ఉద్యమంవైపు మళ్లించిన ఘతన ఆయనది. అర్థంకాని టీఎంసీ ల నీటి లెక్కలను కూడా అందరికి అర్థమయ్యేలా చెప్పగల నేర్పరి ఆయన.

అందుకే ప్రతిపక్షాలు మాటల మరాఠీ అని విమర్శించినా ఆ మాటలే ఆయనను ఉద్యమ నాయకుడిని నుంచి తెలంగాణ తొలి సీఎం వరకు తీసుకొచ్చాయి.

సీఎం అయ్యాక కేసీఆర్ మునపటిలా మాట్లాడలేకపోతున్నారు. హోదా అడ్డురావడమో లేక మరేది కారణమో కానీ, ఆయన మాటలు ఉద్యమ నేతగా ఉన్నప్పటిలా లేవు. అయితే చాలా రోజుల తర్వాత కేసీఆర్ మరో పిట్టకథ చెప్పి అందిరిని ఆకట్టుకున్నారు. భక్త రామదాసు ప్రాజెక్టు బహిరంగ సభ దీనికి వేదికైంది. ఆ సభలో సీఎం కేసీఆర్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును పొగడ్తల్లో ముంచెత్తుతూ ఆయన గురించి ఓ పిట్ట కథ చెప్పారు.

 ‘‘ ఓ అవ్వ ఇంటికి చాలా దూరం నుంచి ఓ చుట్టం వచ్చాడట. ఆయన పోతాపోతా అని తొందరపెడితే, చాలా దూరం పోవాలి కదా బిడ్డా.. ఇంకా అన్నం తయారు కాలేదు, రాత్రిది కొద్దిగ చద్దన్నం ఉంది. కొద్దిగా తినివెళ్లు అని ఆ పెద్దమ్మ అందట. దానికి ఆ చుట్టం బదులిస్తూ అట్లేం లేదు పెద్దమ్మ చద్దన్నం తింటా.. ఉడుకన్నం అయేదాక ఉంటా అని అన్నాట్ట’’ అని చెప్పారు. తుమ్మల కూడా ఆ చుట్టం లానే ఉన్నాడని, ముందు కొన్ని పనులు చేయించుకొని అవి పూర్తికాకముందే ఇంకొన్ని పనులకు హామీలు ఇప్పించుకుంటారని కేసీఆర్ పేర్కొనడంతో సభలో చప్పట్లు మారుమోగాయి.