హైదరాబాద్: ఆక్సిజన్ విషయంలో ఇతర రాష్ట్రాలపై ఆధారపడొద్దని తెలంగాణ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు అవసరమైన ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సోమవారం నాడు  కరోనాపై తెలంగాణ సీఎం కేసీఆర్ హైద్రాబాద్ ప్రగతి భవన్ లో సమీక్ష నిర్వహించారు.  హైద్రాబాద్ లో మరో 100 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. భవిష్యత్తులో ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. 

also read:కరోనాపై కేసీఆర్ సమీక్ష:లాక్‌డౌన్ అమలుపై ఆరా

కరోనా పేషేంట్లకు 324 టన్నుల ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని ఆయన అధికారులను కోరారు. 48 ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. చికిత్స, సౌకర్యాలున్నందున పేదలు ప్రభుత్వాసుపత్రుల్లో చేరాలని సీఎం కోరారు. 10 రోజుల్లో ట్యాంకర్లు అందించాలని ఉత్పత్తిదారులను కోరారు సీఎం కేసీఆర్. మరోవైపు కరోనా వ్యాక్సిన్ల పంపిణీ కోసం గ్లోబల్ టెండర్లు పిలవాలని సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో కరోనా కేసుల పరిస్థితులపై సీఎం అడిగి తెలుసుకొన్నారు. లాక్‌డౌన్ అమలు ఎలా ఉందనే విషయమై  ఆయన ఈ సమీక్షలో అధికారులను వివరాలు అడిగారు. 10 రోజుల పాటు రాష్ట్రంలో లాక్ డౌన్ అమల్లో ఉంది.