హైదరాబాద్: ప్రగతి నివేదన సభ సాక్షిగా తెలంగాణ సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ను గద్దెదిండచమే లక్ష్యమంటూ ప్రకటించడం దారుణమన్నారు. ప్రజలకు ఏం చెయ్యాలో అనే ఆలోచన ఉండాలే తప్ప ఎవరిని దించాలా అన్నఆలోచనతో ఉండకూడదన్నారు. 

గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇసుక మాఫియా పెట్రేగిపోయిందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. ఇసుకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అవినీతికి పాల్పడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పదేళ్ల కాలంలో కేవలం 10కోట్లు ఆదాయం వస్తే టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1980 కోట్లు ఆదాయం వచ్చిందన్నారు.

 కాంగ్రెస్ నేతల అవినీతి, రాజకీయాలను పక్కన పెట్టడంతోనే ఆదాయం వచ్చిందన్నారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతలు టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తున్న ప్రాజెక్టులపై కేసులు పెడుతున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వాగ్ధానాలను ప్రజలు నమ్మెద్దని నమ్మితే ఘోష పడతారన్నారు. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ చక్రవర్తులకు సామంతులుగా ఉందామని చెప్తున్నారని దుయ్యబుట్టారు. తెలంగాణ ప్రజలను ఢిల్లీకి బానిసలుగా చేద్దామని ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ అంశంపై తెలంగాణ మేధావులు, కవులు, రచయితలు, కళాకారులు దయచేసి ఆలోచించాలని కేసీఆర్ కోరారు. 

ఢిల్లీకి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు తెలంగాణలోనే తీసుకోవాలని..ఢిల్లీలో కాదన్నారు. తెలంగాణా రాష్ట్రానికి సంబంధించిన నిర్ణయాలు సీట్లు కేటాయింపులు అన్నీ ఇక్కడే తీసుకుంటామే తప్ప కాంగ్రెస్ పార్టీలా ఢిల్లీలో కాదని ఎద్దేవా చేశారు.