తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఫిక్సయ్యింది. రేపు లేదా ఎల్లుండి మంత్రుల ప్రమాణ స్వీకారం చేయించేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మంత్రుల ఎంపిక ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ముఖ్యమంత్రి.. తన రెండో కేబినెట్‌లో 10 మందికి అవకాశం ఇవ్వబోతున్నారని, వీరంతా కొత్తవారేనని ప్రచారం జరుగుతోంది.

ఇప్పటికే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి రెండు నెలలు గడుస్తుండటం, అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టాల్సి ఉండటంతో కేసీఆర్ స్పీడ్ పెంచారు. ఆర్ధికశాఖ మంత్రిని నియమించి ఆయన చేత బడ్జెట్‌ను సభలో ప్రవేశపెట్టించాలని సీఎం భావిస్తున్నారు.

దీనిని బట్టి రేపు లేదా ఎల్లుండి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు సీఎం కేసీఆర్ శుక్రవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. మంత్రివర్గ విస్తరణ, ప్రమాణ స్వీకారంతో పాటు రాష్ట్ర బడ్జెట్‌కి సంబంధించి అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ ఇప్పటికే ఖరారవ్వడంతో వాటిపైనా సీఎం, గవర్నర్ చర్చించే అవకాశం కనిపిస్తోంది.