హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం నాడు మధ్యాహ్నం ప్రగతి భవన్ లో ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కూడ  ప్రజలు రోడ్లపైకి వస్తున్నారు.  దీంతో తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉందని సమాచారం.

Also read:కరోనా ఎఫెక్ట్: ఐటీ రిటర్న్స్ దాఖలుకు గడువు పెంపు

ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నిర్వహించిన సమావేశానికి వ్యవసాయ, రెవిన్యూ, వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ప్రిన్సిపల్ సెక్రటరీలు హాజరయ్యారు. అధికారులతో పాటు పలువురు మంత్రులు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారు.

జనతా కర్ప్యూ  హైద్రాబాద్ లో విజయవంతమైంది. అయితే లాక్‌డౌన్ మొదటి రోజైన ఈ నెల 23న రోడ్లపై జనం వాహనాలతో వచ్చారు. ఇవాళ రోడ్లపై కొంచెం వాహనాల రద్దీ తగ్గింది.

లాక్‌డౌన్ ను ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరించాలని కేంద్రం ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. దీంతో అవసరమైతే కర్ఫ్యూను విధించాలని కూడ ప్రభుత్వం యోచిస్తోందని సమాచారం.

అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం కేసీఆర్ వీడియో కాన్పరెన్స్ నిర్వహిస్తారు.. ఈ సమావేశం తర్వాత కేసీఆర్ మీడియాతో మాట్లాడనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొన్న కీలక నిర్ణయాలను సీఎం కేసీఆర్  మీడియాకు వివరించనున్నారు.