తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్.. మంగళవారం (ఫిబ్రవరి 14) రోజు కొండగట్టు పర్యటనకు వెళ్లాల్సి ఉంది.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కొండగట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్.. మంగళవారం (ఫిబ్రవరి 14) రోజు కొండగట్టు పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అయితే మంగళవారం కొండగట్టులో భక్తుల రద్దీ అధికంగా ఉండే అవకాశం ఉండటంతో సీఎం కేసీఆర్ పర్యటనలో మార్పు చోటుచేసుకుంది. బుధవారం కేసీఆర్ కొండగట్టు పర్యటనకు వెళ్లనున్నారు. 

కొండగట్టు పర్యటనలో భాగంగా.. బుధ‌వారం ఉద‌యం సీఎం కేసీఆర్ ఆంజనేయస్వామి ఆల‌యానికి వెళ్లి స్వామి వారి ద‌ర్శ‌నం చేసుకుంటారు. అనంత‌రం కొండ‌గ‌ట్టును ఆల‌యాన్ని క్షేత్ర స్థాయిలో ప‌రిశీలించ‌నున్నారు. కోనేరు పుష్క‌రిణి, కొండ‌ల‌రాయుని గుట్ట‌, సీతమ్మ వారి క‌న్నీటిధార‌, భేతాళ స్వామి ఆల‌యంతో పాటు త‌దిత‌ర ప్రాంతాల‌ను సీఎం ప‌రిశీలించ‌నున్నారు. ఆలయాన్ని ప‌రిశీలించిన అనంత‌రం జేఎన్టీయూ క్యాంప‌స్‌లోని కాన్ఫ‌రెన్స్ హాల్లో అధికారుల‌తో సీఎం స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించ‌నున్నారు. అనంతరం అక్కడే కేసీఆర్ మీడియాతో కూడా మాట్లాడే అవకాశం ఉంది. సీఎం కేసీఆర్‌తో పాటు ఆర్కిటెక్ట్ ఆనంద్‌సాయి కూడా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని పరిశీలించనున్నారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ను ఆనంద్‌సాయి రూపొందించనున్నారు.

ఇక, కొన్ని నెలల కింద జగిత్యాల జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్.. మల్యాల మండలం ముత్యంపేటలో ఉన్న కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్దికి రూ. 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం.. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి సీఎం ప్రత్యేక అభివృద్ధి నిధి కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.