తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ధి వేడుకల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజనులకు భూముల పట్టాలు పంచాలని , ఇందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పడి పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గిరిజనులకు భూముల పట్టాలు పంచాలని సీఎం నిర్ణయించారు. మంగళవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. జూన్ 24 నుంచి 30 వరకు గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. కొత్తగా పోడు భూముల పట్టాలు పొందిన వారికి రైతుబంధు వర్తింపజేయాలని కూడా కేసీఆర్ అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వమే స్వయంగా బ్యాంక్ ఖాతాను తెరిచి.. పోడు భూముల పట్టాల యజమానులకు నేరుగా రైతు బంధును జమ చేస్తుందని కేసీఆర్ చెప్పారు. గిరిజన రైతుల బ్యాంక్ ఖాతాల వివరాలను ఆర్ధిక శాఖకు అందించాలని మంత్రి సత్యవతి రాథోడ్‌ను ఆదేశించారు. పోడు భూముల పంపిణీ కార్యక్రమానికి తానే హాజరవుతానని కేసీఆర్ తెలిపారు. గ్రామాల్లో నిరుపయోగంగా వున్న భూముల్లో పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. గృహలక్ష్మీ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలను కూడా రూపొందించాలని కేసీఆర్ కోరారు. అలాగే జూన్ 14న నిమ్స్ హాస్పిటల్ విస్తరణ పనులకు కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. 2000 పడకలతో నూతనంగా నిర్మించనున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ భవనానికి సీఎం శంకుస్థాపన చేస్తారు.
ALso Read: తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు.. అధికారిక లోగో ఆవిష్కరించిన కేసీఆర్...
కాగా.. తెలంగాణ రాష్ట్ర 10వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జూన్ 2 నుంచి 21 రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. గత దశాబ్దంలో సాధించిన ప్రగతి, తెలంగాణ అస్తిత్వానికి అద్దం పట్టే అధికారిక లోగోను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు సోమవారం సచివాలయంలో ఆవిష్కరించారు. రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం లోగోను రూపొందించింది.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అధికారిక లోగోలో అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం, కాళేశ్వరం వంటి నీటిపారుదల ప్రాజెక్టులు, నిరంతర విద్యుత్ సరఫరా, వ్యవసాయం, మిషన్ భగీరథ, యాదాద్రి వంటి సాంస్కృతిక ఆధ్యాత్మిక క్షేత్రాలు, హైదరాబాద్ మెట్రో రైలు, టి-హబ్ లు అన్నీ పొందుపరిచారు. ఇది కాకుండా, తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట (రాష్ట్ర పక్షి), కొత్తగా నిర్మించిన అమరవీరుల స్మారక నిర్మాణాలతో రాష్ట్ర ఖ్యాతిని ప్రతిబింబించేలా లోగోను రూపొందించారు. 21 రోజుల పాటు జరిగే వేడుకలను పండుగ వాతావరణంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.
