గత కొన్ని నెలలుగా నిలిచిపోయిన గొర్రెల పంపిణీకి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కరోనా వల్ల మొదటి విడత గొర్రెల పంపిణీ నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో 75 శాతం సబ్సిడీతో గొల్ల కురుములకు గొర్రెలు పంపిణీ  చేయాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు.

డీడీలు కట్టిన 30 వేల మందికి తక్షణం గొర్రెలు పంపిణీ చేయాలని కేసీఆర్ సూచించారు. వచ్చే ఆర్ధిక సంవత్సరం నుంచి రెండో విడత పంపిణీ చేస్తామని సీఎం తెలిపారు. మార్చిలో పెట్టే బడ్జెట్‌లో దీనికి సంబంధించి నిధులు మంజూరు చేస్తామని  కేసీఆర్ వెల్లడించారు. 

కొన్నేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం భారీ సబ్సిడీతో మొదటి విడతలో 3,65,000 మందికి పైగా 78 లక్షల గొర్రెలు ఇచ్చింది. అయితే ఆ తరువాత రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది.

గత ఏడాది ఈ కార్యక్రమం చేపట్టాలని ప్రభుత్వం భావించినప్పటికీ.. కరోనా కారణంగా అది సాధ్యపడలేదు. రెండో విడతలో 3.61 లక్షల మంది లబ్ధిదారులకు 75.98 లక్షల గొర్రెలు పంపిణీ చేయాల్సి ఉంది. ఇందులో ఇప్పటికే 6 లక్షల గొర్రెలు పంపిణీ చేసినట్లు గతంలో అధికారులు వెల్లడించారు.