అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త.. ఆర్థికసాయం, ఇన్సూరెన్స్‌లు
సీఎం కేసీఆర్ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గుడ్ న్యూస్ చెప్పారు. 3,989 మినీ అంగన్వాడీలను ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేశారు. ఉద్యోగ విరమణ చేసే టీచర్లు, హెల్పర్లకు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఇన్సూరెన్స్, ఎక్స్‌గ్రేషియాలు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని 3,989 మినీ అంగన్వాడీ కేంద్రాలను ప్రధాన అంగన్వాడీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ జీవో జారీ చేశారు. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు 65 ఏళ్లకు ఉద్యోగ విరమణ అవకాశం కల్పించారు. ఉద్యోగ విరమణ చేసే అంగన్వాడీ టీచర్లకు రూ. 1,00,000, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 50,000లు అందజేస్తామని జీవో ఇష్యూ చేశారు. అలాగే, అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్లకు 50 ఏళ్ల వరకు రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం, ఒక వేళ 50 ఏళ్లు దాటితే వారికి రూ. 2 లక్షల ఎక్స్ గ్రేషియాను కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ దురదృష్టవశాత్తు సర్వీస్‌లో ఉండగా అంగన్వాడీ టీచర్లు మరణిస్తే తక్షణ సాయంగా రూ. 20 వేలు, హెల్పర్లు మరణిస్తే రూ. 10 వేలు అందజేయాలనే నిర్ణయం చేశారు.
ఈ నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎం కేసీఆర్ గారికి రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి నెల వీరికి జీతాలు 14వ తేదీలోపు చెల్లిస్తున్నామని వివరించారు. పదవీ విరమణ తర్వాత ఆసరా పెన్షన్లు మంజూరు చేస్తామని వివరించారు. అంగన్వాడీలు సమ్మే విరమించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని డిమాండ్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంగన్వాడీలపై పని ఒత్తిడి తగ్గించడానికి యాప్‌లు సింప్లిఫై చేస్తామని చెప్పారు.
ఈ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 70 వేల అంగన్వాడీలకు లబ్ది చేకూరుతుందని వివరించారు. దేశవ్యాప్తంగా అంగన్వాడీల కోసం ఇలాంటి నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని చెప్పారు. తెలంగాణలోనే అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు అత్యధిక వేతనాలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుతం మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు రూ. 13,650, మినీ అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు రూ. 7,800 వేతనాలు అమల్లో ఉన్నాయని వివరించారు.