గ్రూప్ 2 అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారు కోరుకున్నట్టు పరీక్షను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకుంది. టీఎస్‌పీఎస్సీని సంప్రదించి ఈ మేరకు నిర్ణయాలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలతో ప్రధాన కార్యదర్శి చర్చించారు. పరీక్షను నవంబర్ నెలకు వాయిదా వేసినట్టు తెలిపారు. 

హైదరాబాద్: గ్రూప్ 2 పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. అభ్యర్థుల కోరిక మేరకు పరీక్షను వాయిదా వేయాలనే నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మన్, సెక్రెటరీలతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చర్చ చేశారు. అనంతరం, గ్రూప్ 2 పరీక్షను నవంబర్ నెలకు వాయిదా వేసినట్టు తెలిపారు. త్వరలోనే తేదీలపై స్పష్టత రానుంది.

Scroll to load tweet…

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయడానికి టీఎస్‌పీఎస్సీని సంప్రదించాలని ప్రధాన కార్యదర్శికి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్టు కేటీఆర్ ట్వీట్ చేశారు. లక్షలాది మంది అభ్యర్థులకు ఇబ్బంది కలగకుండా ఈ పరీక్ష వాయిదా వేయాలని సూచించినట్టు వివరించారు. అంతేకాదు, భవిష్యత్‌లోనూ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్లు జారీ చేసేటప్పుడు ఒకేసారీ అన్నింటినీ విడుదల చేయకుండా తగిన వ్యవధి ఇస్తూ అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధులు కావడానికి తగిన సమయం ఉండేలా చూసుకోవాలని చీఫ్ సెక్రెటరీకి సీఎం కేసీఆర్ సూచనలు చేశారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

Also Read: గ్రూప్-2 వాయిదా వేయండి.. గన్ పార్క్ వద్ద అభ్యర్థుల ధర్నా.. తీవ్ర ఉద్రిక్తత

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని, ఈ పరీక్షకు సన్నద్ధమయ్యే సమయం ఉండటం లేదని గ్రూప్ 2 అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నెలలో వరుసగా గురుకులాలు, జేఎల్, డీఎల్ పరీక్షలు ఉన్నాయి. వచ్చే నెల 15వ తేదీన టెట్ పరీక్ష కూడా ఉన్నది. ఇదిలా ఉండగా ఈ నెల చివరిన 29వ, 30వ తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలకు సిలబస్‌లు కూడా వేర్వేరుగా ఉన్నాయి. దీంతో గ్రూప్ 2 పరీక్షకు ప్రిపేర్ అయ్యే సమయం ఉండటం లేదు. జేఎల్, డీఎల్ పరీక్షలకు ప్రిపేర్ అయినవారు గ్రూప్ 2 కోసం మళ్లీ వేరే సిలబస్ చదవాల్సి వస్తున్నది. అయితే, వరుసగా నోటిఫికేషన్లు విడుదల కావడం, వరుసగా పరీక్షలు ఉండటంతో ఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం ఉండటం లేదు. దీంతో గ్రూప్ 2 పరీక్షలను వాయిదా వేసి ఆ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి తగిన సమయం అభ్యర్థులకు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ అభ్యర్థులు నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకుంది.