KCR: సంఘ సంస్కర్త అన్నాభౌ సాఠేకు భారతరత్న ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్
Hyderabad: మహారాష్ట్ర సంఘ సంస్కర్త అన్నభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) డిమాండ్ చేశారు. అలాగే, 1920 ఆగస్టు 1న జన్మించి 1969 జూలై 18న మరణించిన సాఠేకు అత్యున్నత గౌరవం కల్పించాలని కేంద్రానికి లేఖ రాయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
Telangana Chief Minister K Chandrasekhar Rao: మహారాష్ట్ర సంఘ సంస్కర్త అన్నభావ్ సాఠేకు భారతరత్న ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కే.చంద్రశేఖర్ రావు (కేసీఆర్) డిమాండ్ చేశారు. అలాగే, 1920 ఆగస్టు 1న జన్మించి 1969 జూలై 18న మరణించిన సాఠేకు అత్యున్నత గౌరవం కల్పించాలని కేంద్రానికి లేఖ రాయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
వివరాల్లోకెళ్తే.. ప్రముఖ మరాఠీ కవి, సంఘ సంస్కర్త అన్నభావ్ సాఠేకు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ఇవ్వాలని ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు తెలిపారు. అంతకుముందు మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లా వాటేగావ్ లో సాఠే స్మారక చిహ్నాన్ని సందర్శించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ చీఫ్ ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాస్తుందని చెప్పారు. 1 ఆగస్టు 1920న జన్మించి 18 జూలై 1969న మరణించిన అన్నభావ్ సాఠేకు అత్యున్నత పురస్కారం ఇవ్వాలని కేంద్రానికి లేఖ రాయాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సైతం కోరారు. మహాకవి జన్మస్థలమైన వాటేగావ్ లోని అన్నభావ్ సాఠే సమాధి వద్ద కేసీఆర్ నివాళులర్పించారు.
వెనుకబడిన మాతంగ్ సామాజిక వర్గానికి చెందిన అన్నభావ్ సాఠే మరాఠీ మాట్లాడే ప్రజలకు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుతున్న సంయుక్త మహారాష్ట్ర ఉద్యమంలో బలమైన గొంతుకగా ఎదిగారు. సామాజిక రుగ్మతలపై దాడి చేస్తూ కవితలు, పాటలు రాశారు. దళితులు, ఇతర వర్గాల్లో అన్నభావ్ సాఠేకు ఎంతో గౌరవం ఉంది. తన సాంగ్లీ పర్యటనను ముగించుకున్న అనంతరం కొల్హాపూర్ లోని అంబాబాయి ఆలయాన్నికూడా కేసీఆర్ సందర్శించారు. ఇదిలావుండగా, షెట్కారీ సంఘటనా సంస్థతో సంబంధం ఉన్న రైతు నాయకుడు రఘునాథ్ దాదా పాటిల్ మంగళవారం బీఆర్ఎస్ లో చేరారని కొల్హాపూర్ లోని బీఆర్ఎస్ నాయకుడు మాణిక్ కదమ్ తెలిపారు.
సీఎం కేసీఆర్ మహారాష్ట్రలో తన పార్టీ పునాదిని విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. బీఆర్ ఎస్ విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి గత నెలలో షోలాపూర్ లో పర్యటించారు. బీఆర్ఎస్ విస్తరణ కోసం మహారాష్ట్రలోని ఉద్యమకారులు, ప్రజా పోరాట నాయకులు, సంబంధిత వర్గాలను కేసీఆర్ టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. అబ్ కీ బార్ కిసాన్ సర్కారు అంటూ దేశంలోని వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ తన విస్తరణ ప్రణాళికలను ముందుకు తీసుకెళ్తోంది. ఇదే సమయంలో అధికార, ప్రతిపక్ష కూటములు ఏన్డీయేలో కానీ, కాంగ్రెస్ లో గాని చేరకుండా ఎన్నికల్లో రంగంలోకి దిగేందుకు ప్లాన్ చేసుకుంటోంది బీఆర్ఎస్.