తెలంగాణలో భారీ వర్షాలు : రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవులు.. కేసీఆర్ ఆదేశాలు
తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఇప్పటికే గత గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.

తెలంగాణలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. బుధ, గురువారాల్లో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు, ఎల్లుండి విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించాలని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని కేసీఆర్ ఆదేశించారు. గత గురువారం నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ..ఇప్పటికే గత గురువారం నుంచి శనివారం వరకు రాష్ట్ర ప్రభుత్వం సెలవులు ఇచ్చిన విషయం తెలిసిందే.
అయితే వర్షాలు కాస్త తెరిపిని ఇవ్వడంతో సోమవారం నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి. కానీ ఈరోజు తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురవడం, మరో రెండు రోజులు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమైంది. పిల్లలు, విద్యార్ధుల భద్రతను దృష్టిలో వుంచుకుని రేపు , ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కేసీఆర్ నిర్ణయించారు.
తెలంగాణలో ఈ నెల 27 వరకు వర్షాలు:
ఈ నెల 26న తూర్పు తెలంగాణ, ఉత్తర తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, మధ్య తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్, దాని పరిసర జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ఈ నెల 27న తెలంగాణ రాజధాని ప్రాంతంలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ :
భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో హైదరాబాద్ కు రెడ్ అలర్ట్ జారీ చేశారు. చార్మినార్, ఖైరతాబాద్, కూకట్ పల్లి, ఎల్బీనగర్, సికింద్రాబాద్, శేరిలింగంపల్లి జోన్లలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నగరంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 26, 27 తేదీల్లో హైదరాబాద్ కు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
ALso Read: Heavy Rainfall: భారీ నుంచి అతిభారీ వర్షాలు.. హైదరాబాద్ కు రెడ్ అలర్ట్
కాగా, గడిచిన 24 గంటల్లో నిజామాబాద్ లో అత్యధికంగా 464 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ లోని చార్మినార్ లో 79 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలంగాణ స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్ డీపీఎస్ ) తెలిపింది. వర్ష సూచనల దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, అందుకు అనుగుణంగా ప్రయాణాలను ప్లాన్ చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు.