సీఎం కేసీఆర్ ను ఏడ్పించే ధైర్యం ఎవరికి ఉంది.. అసలు ఆయన భయపడే రకమా... తెలంగాణ ఉద్యమ పోరాటంలో ఎన్నో ఆరోపణలు, విమర్శలు వచ్చినా ఎప్పుడూ వెనకడుగు వేయలేదు.

 

మాటల తూటాలతో ఉద్యమంలో వేడి పుట్టించారు. తెలంగాణ వ్యతిరేకులను ఓ ఆట ఆడుకున్నారు. అయినా కూడా కేసీఆర్ రెండు సార్లు ఏడ్చినంత పనిచేశారట. భయపడితే కాదు... బాధలు చూసి ఏడ్చారట. ఈ విషయాన్ని ఆయన స్వయంగా చెప్పుకొచ్చారు.

 

జనహిత పేరుతో తన జన్మదినం రోజు నుంచి ఓ కొత్త కార్యక్రమాన్ని సీఎం ప్రారంభించిన విషయం తెలిసిందే. మొదటి రోజు దివంగత జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థికసాయం అందించడంతో ఈ కార్యక్రమం ప్రారంభించారు.

 

ఆ తర్వాత చేనేత కార్మికుల జీవితాలను మెరుగు పరిచేందుకు అధికారులతో సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా చేనేత బతుకుల జీవితాలను చూసి తాను చలించిన ఘటనను ఓ సారి గుర్తు చేసుకున్నారు.

 

‘నేనే కరీంనగర్ ఎంపీగా ఉన్నప్పుడు సిరిసిల్లకి చెందిన 11 మంది నేతన్నలు  మృతి చెందారు. ఆ ఘటన నన్ను ఎంతో బాధించింది. దాదాపుగా ఏడ్చినంత పనైంది. దు:ఖాన్ని ఆపుకోలేకపోయా.. సిరిసిల్ల నేత కార్మికులకు దేశ వ్యాప్తంగా మంచి పేరు ఉంది. వారు ఇలా అయిపోవడమేంటని చాలా సార్లు ప్రశ్నించుకున్నా. నాడు ప్రభుత్వం నుంచి వారికి సాయం అందలేదు. అందుకే పార్టీ తరఫున రూ. 50 లక్షలు  నేత కార్మికులకు విరాళంగా ఇచ్చాం.

 

ఇంకోసారి పోచంపల్లిలో  ఏడుగురు నేతన్నలు చనిపోతే చలించి భిక్షాటన చేసి వారి కుటుంబాలకు రూ. 4 లక్షలు అందించా. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టే వారిని ఆదుకునేందుకు  త్రిముఖ వ్యూహంతో ఓ కొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం’ అని పేర్కొన్నారు.