Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ లావాదేవీలకు టిఎస్ వాలెట్

  • నోట్ల రద్దువల్ల రియల్ ఎస్టేట్ పడిపోయింది
  • ప్రజలంతా ఆన్ లైన్ లావాదేవీలకు మారాలి
  • క్యాష్ లెస్ నియోజకవర్గంగా సిద్ధిపేట
  • కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వెల్లడి
cm kcr cabinet meeting

 

పెద్ద నోట్లు రద్దు చేస్తూ కేంద్ర తీసుకున్న నిర్ణయం విప్లవాత్మక చర్య అని సీఎం కె. చంద్రశేఖర్ రావు అభివర్ణించారు. నోట్ల రద్దు అనేది ఒక వ్యూహం అని .. అది ఎట్లా అర్థం చేసుకుంటే అట్లా అర్థం అవుతుందని పేర్కొన్నారు.

 

సోమవారం సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీ అనంతరం వివరాలను సీఎం కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. నోట్ల రద్దు అనేది కేంద్రం తీసుకున్న నిర్ణయమని ఇందులో రాష్ట్రాల పాత్ర ఏమీ ఉండదని పేర్కొన్నారు. అయితే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న దృష్టా రాష్ట్రాలు ఈ విషయంలో మౌనంగా ఉండరాదన్నారు.  

 

నోట్ల రద్దుపై ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, దీనిపై తన అవగాహనను ప్రధానితో ఇటీవల పంచుకున్నానని .. మోదీ కూడా తన అభిప్రాయాలతో ఏకీభవించారని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపైనే కేబినెట్ లో సుదీర్ఘంగా చర్చించినట్లు వెల్లడించారు.

 

 

పెద్దనోట్ల రద్దు తర్వాత రాష్ట్రంలో పరిస్థితిని అంచనా వేసేందుకు టాస్క్ఫోర్స్‌ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. నల్లధనం ఏ రూపంలో ఉన్నా.. దానిని అరికట్టవచ్చునని చెప్పారు. 100 శాతం నగదు రహిత లావాదేవీలను చేయాలనే లక్ష్యంతో సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గాన్ని పైలట్‌ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించామని ప్రకటించారు.

 

అలాగే, రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలను ఆన్ లైన్ లోనే జరిపేందుకు వీలుగా  టీఎస్‌ వాలెట్‌ను ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో జీహెచ్‌ఎంసీలో కార్మికులు ఉపాధి కోల్పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

 

రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు, పౌర సరఫరా కార్యాలయాలు, ఇతర అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో స్వైపింగ్‌ మిషిన్లను అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఇకపై ప్రజలందరూ మొబైల్ ద్వారా చెల్లింపులు జరిపేలా ప్రోత్సహిస్తామన్నారు.  

 

రాష్ట్రంలో 85 లక్షల జన్‌ధన్‌ ఖాతాలు ఉన్నాయని వారందరూ ఆన్ లైన్ లావాదేవీలు జరిపేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. నోట్ల రద్దు ప్రభావం రాష్ట్రంలోని రియల్‌ ఎస్టేట్‌ పై భారీగా పడిందన్నారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios