వరంగల్: ముఖ్యమంత్రి కేసీఆర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతుండటంతో ఇవాళ(శుక్రవారం) జరగాల్సిన భూపాలపల్లి జిల్లా పర్యటన వాయిదా పడింది. ఈ జిల్లాలో కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ఏరియల్ సర్వే ద్వారా సీఎం కేసీఆర్ పరిశీలించాల్సి ఉంది. కానీ ఈ పర్యటన వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం ప్రకటించింది.

 ఊపిరితిత్తుల్లో చిన్న ఇన్‌ఫెక్షన్ తో సీఎం కేసీఆర్ బాధపడుతున్నట్లు యశోద ఆసుపత్రి డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.గురువారం నాడు మధ్యాహ్నం యశోద ఆసుపత్రిలో సీఎం కేసీఆర్ వైద్య పరీక్షలు చేయించుకొన్నారు.  ఈ పరీక్షల తర్వాత కేసీఆర్ తిరిగి ఇంటికి వెళ్లారు. ఛాతీలో మంట కారణంగా ఆయన ఆసుపత్రిలో  పరీక్షలు చేయించుకొన్నారని చెప్పారు.

కేసీఆర్ కు ఐదు రోజుల పాటు మందులు ఇచ్చినట్టుగా డాక్టర్ చెప్పారు. కేసీఆర్ నుండి తీసుకొన్న బ్లడ్ రిపోర్టులు, 2 డీ ఎకో రిపోర్టులు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. 

ప్రతి శీతాకాలం బ్రాంకెయిటీస్ సమస్య  ఉంటుందని ఆయన చెప్పారు. కేసీఆర్ కు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. చాతీలో  మంట కారణంగా యశోద ఆసుపత్రిలో పరీక్షలు చేయించుకొన్నారన్నారు. కేసీఆర్ వెంట ఆయన భార్య శోభ, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, ఎంపీ సంతోష్ యశోదా హాస్పిటల్ కు వెళ్లారు.