కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనలో భాగంగా మంగళవారం సీఎం కేసీఆర్ మేడిగడ్డ జలాశయాన్ని సందర్శించారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో అధికారులు, ఇంజినీర్లతో కలిసి ప్రాజెక్టు సందర్శనకు వచ్చారు. మేడిగడ్డ ఆనకట్టపైకి చేరుకున్న ముఖ్యమంత్రికి, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కలెక్టర్  వెంకటేశ్వరులు, ఎస్పీ భాస్కరన్‌, ఇతర అధికారులు స్వాగతం పలికారు. అనంతరం 70,71 గేట్ల వద్ద గోదావరి మాతకు పూలు, పట్టు వస్త్రాలు సమర్పించి సీఎం కేసీఆర్‌ పూజలు నిర్వహించారు.

అనంతరం సీఎం కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. అధికారులు, ఇంజినీర్లతో కలిసి మేడిగడ్డ జలాశయాన్నిపూర్తిగా పరిశీలించారు.  గోదావరి ప్రవాహానికి సంబంధించిన వివరాలను ఇంజినీర్లు ఆయనకు వివరించారు.అక్కడి నుంచి గోలివాడ పంపుహౌస్‌ చేరుకొని పరిశీలిస్తారు. అక్కడి అధికారులతో సమావేశమై నీటి ఎత్తిపోతకు సంబంధించి వివరాలపై ఆరాతీయనున్నారు. అక్కడి నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు పర్యటన తర్వాత ధర్మపురి లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకుంటారు. సాయంత్రం తిరిగి హైదరాబాద్‌కు పయనమవుతారు.

"