నాంపల్లి అగ్ని ప్రమాదం: ఆధారాలను సేకరిస్తున్న క్లూస్ టీమ్, రమేష్ జైస్వాల్ ను అదుపులోకి తీసుకోనున్న పోలీసులు
నాంపల్లి అగ్ని ప్రమాదంపై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. అగ్ని ప్రమాద తీవ్రత పెరగడానికి కెమికల్ డబ్బాలు కారణమని అగ్నిమాపక శాఖ అభిప్రాయపడుతుంది.
హైదరాబాద్:నాంపల్లి అగ్ని ప్రమాదంపై క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. ఈ నెల 13వ తేదీన నాంపల్లిలోని బజార్ ఘాట్ లో ఓ భవనంలో అగ్ని ప్రమాదం జరిగింది.ఈ ప్రమాదంలో తొమ్మిది మంది మృతి చెందారు. మరో ఎనిమిది మంది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో ఫోరెన్సిక్ టీమ్ ఆధారాలను సేకరిస్తుంది. మరో వైపు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై క్లూస్ టీమ్ ఆరా తీస్తుంది. ప్రమాదం జరిగిన భవనంతో పాటు ఎదురుగా ఉన్న భవనం కూడ స్వల్వంగా దెబ్బతింది . ఎదురుగా ఉన్న భవనంలో నివసిస్తున్న వారు సహాయక చర్యల్లో పాల్గొన్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో చోటు చేసుకున్న పరిణామాల గురించి క్లూస్ టీమ్ బృందం ఆరా తీస్తుంది.
అగ్ని ప్రమాదం జరిగిన భవనంలో రసాయన డబ్బాలను నిల్వ చేశారు. ఈ డబ్బాల కారణంగా అగ్ని ప్రమాద తీవ్రత పెరిగిందని అగ్నిమాపక శాఖ అభిప్రాయపడింది. అయితే రసాయనాలను ఈ భవనంలో నిల్వ చేసినందుకు రమేష్ జైస్వాల్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసన తర్వాత రమేష్ జైస్వాల్ అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వెంటనే రమేష్ జైశ్వాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకొంటారు.
also read:'కెమికల్ డబ్బాల వల్లే ప్రమాద తీవ్రత':నాంపల్లి అగ్నిప్రమాదంపై కేసు
మరోవైపు అగ్ని ప్రమాదం జరిగిన భవనాన్ని జేఎన్‌టీయూ ఇంజనీర్ల బృందం పరిశీలించనుంది. భవనాన్ని పరిశీలించిన తర్వాత భవన పటిష్టతపై ఇంజనీర్ల బృందం ఓ నివేదికను ఇవ్వనున్నారు. ఈ నివేదిక ఆధారంగా భవనం కూల్చివేతపై నిర్ణయం తీసుకొంటారు.
ఇదిలా ఉంటే ఈ ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలని ప్రభుత్వం వైద్యులను ఆదేశించింది. ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల పరిస్థితి విషమంగానే ఉందని సమాచారం.