హైదరాబాద్: సిఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో  శుక్రవారం నాడు సిఎల్పీ సమావేశం  ప్రారంభమైంది. రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై  ఈ సమావేశంలో చర్చించనున్నారు.ఈ సమావేశానికి మాజీ మంత్రి డికె అరుణ , ఎమ్మెల్సీ కూచకుళ్ళ దామోదర్ రెడ్డి గైరాజరయ్యారు.


మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొనే విషయమై కనీసం తనను సంప్రదించలేదనే  బాధతో ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీని వీడాలని నిర్ణయం  తీసుకొన్నారు. త్వరలోనే దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయన తన అనుచరులతో సమావేశమై ఈ నిర్ణయం  తీసుకొన్నారు.దామోదర్ రెడ్డి పార్టీ మారాలని నిర్ణయం తీసుకొన్నందున ఆయన కూడ ఈ సమావేశానికి హజరుకాలేదు. 

మరోవైపు గద్వాలలో ఇతర కార్యక్రమాలున్నందున సీఎల్పీ సమావేశానికి తాను హాజరుకాలేనని మాజీ మంత్రి డికె అరుణ గురువారం నాడే ప్రకటించారు ఈ ప్రకటనకు అనుగుణంగానే ఆమె ఇవాళ జరిగిన సిఎల్పీ సమావేశానికి హాజరుకాలేదు. నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ల సభ్యత్వాలను రద్ద చేస్తూ అసెంబ్లీ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ గెజిట్ నోటిఫికేషన్ పై కాంగ్రెస్  పార్టీకి చెందిన  ఎమ్మెల్యేలు కోర్టును ఆశ్రయిస్తే కోర్టు ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. టిఆర్ఎస్  ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు డివిజన్ బెంచ్  కొట్టివేసింది.ఈ రెండు కేసుల్లో కూడ ఎమ్మెల్యేలకు అనుకూలంగా తీర్పులు వెలువడ్డాయి.కానీ, వారిని ఎమ్మెల్యేలుగా మాత్రం పరిగణించడం లేదు.


దీంతో కోర్టు ఉత్తర్వులను అమలు చేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ  కోర్టు ధిక్కరణ పిటిషన్ ను ధాఖలు చేయాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భావిస్తున్నారు.మరోవైపు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా మూకుమ్మడి రాజీనామాలు చేయాలని  ప్రతిపాదన కూడ ఒకటి ఉంది.ఈ విషయమై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర  ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే వ్యూహన్ని అమలు చేయాలని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.