హైదరాబాద్: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు.

బుధవారం నాడు సీఎం కేసీఆర్ కు ఆయన లేఖ రాశాడు.  కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వచ్చిన తర్వాత వ్యవసాయ చట్టాలపై యూ టర్న్ తీసుకొన్నారని చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలతో రాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు. విద్యుత్ చట్టాలను నిరసిస్తూ ఏ రకంగా తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేశారో... వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కూడ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన ఆ లేఖలో సీఎంను కోరారు.

తన వ్యక్తిగత అవసరాల కోసం సీఎం కేసీఆర్ అన్నదాతల భవిష్యత్తును తాకట్టు పెట్టడం సరైంది కాదని ఆయన హితవు పలికారు. నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో కేసీఆర్ యూ టర్న్ తీసుకొన్నారని విపక్షాలు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఢిల్లీ టూర్ తర్వాత కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.