హైదరాబాద్: పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అప్పగించిన తర్వాతే ఓట్లు అడగాలని  సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క టీఆర్ఎస్ ను డిమాండ్ చేశారు. 
మంగళవారం నాడు హైద్రాబాద్ నాంపల్లిలో సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు.  ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. 

జీహెచ్ఎంసీ పరిధిలో ఇళ్లు లేకున్నా ఉన్నట్టుగా ప్రభుత్వం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లపై ప్రభుత్వం నాటకాలు ఆడుతోందని ఆయన ఆరోపించారు.నగరంలో ఇళ్లు ఉన్నాయో... లేవో చూసేందుకు మంత్రి కేటీఆర్ గ్రౌండ్ కి రావాలని ఆయన సూచించారు. 

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ్యవహరం కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించినట్టుగా ప్రభుత్వం అసెంబ్లీలో ప్రకటించింది.ఈ ఇళ్లను చూపేందుకు తాము సిద్దంగా ఉన్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేతల మల్లు భట్టి విక్రమార్కకు చెప్పారు.

also read:ఆ విషయం తలసానికి తెలియదేమో, అందుకే చాలెంజ్: మల్లుభట్టి విక్రమార్క విమర్శ

ఈ నెల 17, 18 తేదీల్లో నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కకు చూపించారు. నగరంలో కాకుండా నగరం బయట నిర్మించిన ఇళ్లను కూడ నగరంలో చూపించినట్టుగా చూపిస్తున్నారని ఆరోపిపస్తూ ఈ నెల 18వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పరిశీలన నుండి కాంగ్రెస్ బయటకు వచ్చింది.

నగరంలో 3428 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించిందని కాంగ్రెస్ చెబుతోంది. ప్రభుత్వం లక్ష ఇళ్లను నగరంలో నిర్మించలేదని కాంగ్రెస్ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఈ వాదనను టీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తోంది. కాంగ్రెస్ వాదనల్లో పస లేదని చెబుతోంది. నగరం వెలుపల నిర్మిస్తున్న ఇళ్లలో కూడ 10 శాతం స్థానికులు ఇచ్చి... మిగిలినవాటిని నగరవాసులకు నిర్మించి ఇస్తామని టీఆర్ఎస్ ప్రకటించింది.