రేపటి ఖమ్మం జిల్లా బంద్‌కు కాంగ్రెస్ పార్టీ తరపున సంపూర్ణ మద్ధతు ఉంటుందన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. ఆత్మహత్య చేసుకున్న డ్రైవర్ కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.

ఆర్టీసీని ప్రైవేటీకరణ చేసి.. అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని భట్టి ఆరోపించారు. ఉద్యోగాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని.. ఇప్పుడు తీసేస్తా ఎలా అని ఆయన ప్రశ్నించారు.

ప్రజల ఆస్తిని ఎవరికో అప్పగిస్తే ఊరుకునేది లేదని, ప్రజలను బానిసలుగా చూస్తే ఖబడ్డార్ అంటూ విక్రమార్క హెచ్చరించారు. ఉద్యోగులను కుక్కతోకతో పోల్చడం దారుణమని భట్టి ధ్వజమెత్తారు.

మరోవైపు ఆర్టీసీ సమ్మెను తెలంగాణ సాధన ఉద్యం పంథాలో నడపాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. దీనిలో భాగంగా అన్ని వర్గాలను సమ్మెలో భాగస్వామ్యులను చేసేలా ప్రొఫెసర్ కోదండరామ్ కార్యాచరణ రూపొందించారు.

ఈ నెల 13న అన్ని డిపోల ఎదుట వంటావార్పు చేపట్టాలని, ఇందులో కార్మికులతో పాటు ప్రజాసంఘాలు, రాజకీయ నేతలు పాల్గొనేలా చూడాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. 14న కార్మికులు, వారి కుటుంబసభ్యులతో డిపోల ముందు బైఠాయింపు, ధర్నాలు నిర్వహించనుంది.

15న రాష్ట్రంలోని రహదారులపై రాస్తారోకోలు, 16న అన్ని యూనివర్సిటీల విద్యార్ధి సంఘాలు ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపింది. 17న అన్ని డిపోలు ముందు ధూం ధాం, 18న బైక్ ర్యాలీలు నిర్వహించనున్నారు.