హైదరాబాద్: భారత్ బంద్ కు మద్దతుగా మేడ్చల్ జిల్లాలోని షామీర్ పేటలో సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క మంగళవారం నాడు ధర్నా నిర్వహించారు.

భారత్ బంద్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. షామీర్ పేటలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎమ్మెల్యే  కెఎల్ఆర్ తో పాటు పలువురు కాంగ్రెస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.

also read:భారత్ బంద్: షాద్‌నగర్ లో రాస్తారోకోలో పాల్గొన్న కేటీఆర్

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు రైతులకు తీవ్ర నష్టాన్ని చేస్తాయని సీఎల్పీ నేత మల్లుభట్టి విక్రమార్క చెప్పారు.

నూతన వ్యవసాయ చట్టాలతో రైతులకు లాభం జరగదని ఆయన  ఆరోపించారు. నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పలు రకాల ఆందోళనలు నిర్వహించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

రైతుల సంక్షేమం కోసం ఈ చట్టాలను తెచ్చామని కేంద్రం చెబుతోందని.. ఈ చట్టాలతో రైతులకు ఎలాంటి ప్రయోజనం జరగదని ఆయన విమర్శించారు.కేంద్రంలోని బీజేపీ తరహాలోనే తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇదే తరహాలో వ్యవహరించారన్నారు.

తాను చెప్పిన పంటలు వేస్తేనే రైతులకు రైతు బంధు కింద నగదు చెల్లిస్తామని కేసీఆర్ ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఇంత కాలం కేసీఆర్ రైతు చట్టాలను ఎందుకు వ్యతిరేకించలేదో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఇంత కాలం పాటు పామ్ హౌస్ నుండి ఎందుకు బయటకు రాలేదని ఆయన ప్రశ్నించారు. 

జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు రావడంతోనే కేసీఆర్  రైతు సంఘాల బంద్ కు మద్దతును ప్రకటించారన్నారు.నూతన రైతు చట్టాలను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఎందుకు తీర్మానం చేయలేదని భట్టి విక్రమార్క కేసీఆర్ ను ప్రశ్నించారు.రైతుల పట్ల కేసీఆర్ సర్కార్ వ్యవహరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.