Asianet News TeluguAsianet News Telugu

సోనూ సూద్ ను చూసి మన హీరోలు కళ్లు తెరవాలి: మల్లు భట్టి విక్రమార్క

కరోనా వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలు నిర్ణయించాలని  హైకోర్టు ఆదేశించినా కూడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. 

CLP leader Mallu Bhatti vikramarka demands health emergency in Telangana lns
Author
Hyderabad, First Published May 18, 2021, 3:27 PM IST

హైదరాబాద్: సినీ నటుడు సోనూ సూద్ ను చూసి టాలీవుడ్ సినీ హీరోలు కళ్లు తెరవాలని కాంగ్రెసు శానససభా పక్ష (సిఎల్పీ) నేత మల్లుభట్టి విక్రమార్క అన్నారు. కరోనా వేళ సాయానికి ముందుకు రావాలని ఆయన తెలుగు సినీ హీరోలను కోరారు. కరోనా బాధితులను ఆదుకోవాలని ఆయన సూచించారు. 

కరోనా వైద్యానికి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ధరలు నిర్ణయించాలని  హైకోర్టు ఆదేశించినా కూడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం టాస్క్‌పోర్స్ ఏర్పాటు చేసిందన్నారు.ఈ టాస్క్ పోర్స్ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులకు చెప్పినా కూడ ప్రయోజనం లేకపోయిందన్నారు. అసెంబ్లీ వేదికగా ఈ విషయమై తాము చేసిన సూచనలను ఆయన గుర్తు చేశారు.

కరోనా విషయంలో ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను కోరినట్టుగా ఆయన చెప్పారు. సీఎస్ కూడ ఈ విషయమై పట్టించుకోలేదన్నారు. సీఎం. సీఎస్ లు లాక్‌డౌన్ అవసరం లేదని ప్రకటించిన రెండు రోజుల తర్వాత లాక్‌డౌన్ విధించారని ఆయన గుర్తు చేశారు. సీఎం, సీఎస్ ప్రకటనలతో ప్రజలంతా గందరగోళానికి గురయ్యారన్నారు. హైకోర్టు ఒత్తిడితోనే లాక్‌డౌన్ ను అమలు చేస్తున్నారని ఆయన చెప్పారు.

వ్యాక్సిన్ కంపెనీలతో మాట్లాడిన తర్వాత కూడ వ్యాక్సిన్ సరఫరా నిలిచిపోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. సోనుసూద్ తరహాలోనే  కరోనా బాధితులను ఆదుకొనేందుకు టాలీవుడ్ తారలు కూడ ముందుకు రావాలని ఆయన కోరారు.కరోనాపై పూర్తి స్థాయిలో ఒక మంత్రి పర్యవేక్షణ ఉండాలికానీ.. గెస్ట్ యాక్టర్లలా రోజుకొకరు సమావేశాలు పెట్టడం ఏంటని భట్టి తీవ్రంగా ప్రశ్నించారు.

సోనూసూద్ మాదిరిగా తెలుగు సినిమా హీరోలు, హీరోయిన్లు ఆర్టిస్టులు, పారిశ్రామిక వేత్తలు ముందుకు వచ్చిన కరోనా బాధితులకు అండగా నిలవాలని భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఇక వ్యాక్సినేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకూ ఎటువంటి నిర్దిష్టమైన కార్యాచరణ తీసుకోలేదని అన్నారు. రాష్ట్ర జనాభా ఎంత? కేంద్రం నుంచి వస్తున్న వ్యాక్సిన్ డోసులు ఎన్ని? ఫార్మా సంస్థల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేస్తున్న వ్యాక్సిన్ ఎంత? అనేదానిపై ప్రభుత్వం వద్ద క్లారిటీ లేదని భట్టి అన్నారు. ప్రభుత్వంలో కీలక స్థానంలో ఉన్న చీఫ్ సెక్రెటరీ కూడా ఈ వివరాలు చెప్పడం లేదని అన్నారు. 

రాష్ట్రంలో 18 ఏళ్లు పూర్తయిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సినేషన్ చేస్తున్నాం.. అని ప్రకటించారు.. కానీ మొదటి డోస్ సండతి దేవుడెరుడు రెండో డోస్ వాళ్లకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం లేదని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యూ డేట్ పూర్తవుతున్నా రెండో డోస్ వారికి వ్యాక్సిన్ ఇవ్వడం లేదన్నారు. కరోనా విపరీతంగా పెరుగుతున్న ఈ సమయంలో వ్యాక్సినేషన్ ఇవ్వద్దనే ఆదేశాలు ఇవ్వడం అత్యంత దారుణమని భట్టి అన్నారు. ఇంత అన్ ప్లాన్డ్ ప్రభుత్వం దేశంలో మరెక్కడా లేదని భట్టి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వ్యాక్సిన్ తయారీ విషయమై ఇద్దరు ఫార్మసీ కంపెనీలతో టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ కేటీఆర్, సీఎస్ సోమేష్ కుమార్ సమావేశ వివరాలను ఇప్పటివరకూ వెల్లడించలేదని భట్టి చెప్పారు.

రెమిడెసివర్, ఇతర కరోనా మందుల కోసం ప్రజలు బ్లాక్ మార్కెట్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితులున్నాయని భట్టి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ హై కోర్టు వరుస హెచ్చరికలు చేస్తోంది. కొత్త టాస్క్ ఫోర్స్ కమిటీకి హై కోర్టే డైరెక్షన్ ఇస్తోంది... అసలు రాష్ట్రంలో ప్రభుత్వం కోమాలో ఉన్నట్లు ఉంది తప్ప పాలన లేదని భట్టి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి బయటకు రారు..

పాతాళభైరవి సినిమాలోలా ఫామ్ హౌస్ నుంచి బయటకువచ్చి సీఎస్, టాస్క్ ఫోర్స్ కమిటీలతో సమావేశాల హడావిడిచేసి వెళ్లిపోతారు.. తరువాత మళ్లీ కనిపించరని విమర్శించారు. టాస్క్ ఫోర్స్ కమిటీ ఛైర్మన్ కేటీఆర్.. తమిళనాడు సీఎం స్టాలిన్ ను చూసి చాలా నేర్చుకోవాలి.. అక్కడ వేసిన టాస్క్ ఫోర్స్ కమిటీలో 14 మంది ప్రతిపక్ష నాయకులను తీసుకున్నారు. మీవి మాత్రం ఒంటెత్తు పోకడలని భట్టి అన్నారు. న్యాయస్థానాలు, నిపుణులు, మేధావులు ఎవరు చెప్పినా.. ప్రభుత్వం వినడం లేదని అన్నారు. 

తెలంగాణలోని కరోనా బాధితులకు ఆక్సిజన్ దొరకడం లేదు.. మందులు లేవు, తినడానికి తిండి లేదు.. ప్రజలను కరోనా చంపేస్తోంది.. ఈ పరిస్థితుల్లో కూడా మేమున్నామనే భరోసా ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కల్పించడం లేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫామ్ హౌస్ దాటి బయటకు వచ్చి... ప్రజల పరిస్థితులు తెలుసుకోవాలని భట్టి సూచించారు. ధరణి పోర్టల్ తో రెవెన్యూ ప్రక్షాళన అని చెప్పి.. ఎన్నో భయంకర ఇబ్బందులు తెచ్చినట్లుగానే కరోనా విషయంలోనూ ఏమీ చేయడం లేదని అన్నారు. కేటీఆర్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ భాధ్యతలు తీసుకున్నాక.. రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం బందైంది. మండలాల్లోని ప్రైమరీ హెల్త్ సెంటర్లలో 50 మించి టెస్టులు చేయవద్దని పై స్థాయి నుంచి ఆదేశాలున్నాయిన అంటున్నారు.

కరోనాతో ఊళ్లకుఊళ్లు బాధపుడుతున్నా.. ఇదెక్కడి ఆదేశాలని భట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు తెలియదు.. కనీసం ప్రతిక్షనాయకులు చేసే నిర్మాణాత్మక సూచనలైనా పాటించండి.. అంటూ కేటీఆర్ కు ఆయన చురకలు వేశారు. మండలాల్లో, గ్రామాల్లో ఐసొలేషన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తే హైదరాబాద్ మీద ఒత్తిడి తగ్గుతుందని అన్నారు. చీఫ్ సెక్రెటరీకీ ఆ పట్టింపులు కూడా లేవని అన్నారు. రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాల్సిన అవసరం ఉందని అన్నారు. యుద్ధ ప్రాతిపదికన ప్రజలను కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని భట్టి అన్నారు.  గవర్నర్ కూడా చొరవ తీసుకుని పరిస్థితులను మానిటర్ చేయాలని భట్టి అన్నారు.  

ఇదిలా ఉండగా.. అకాల వర్షాల వల్ల ఆరుకాలం పండించిన పంట నీటి పాలవుతోందని అన్నారు. రైతుల తీవ్రంగా నష్టపోతున్నారని భట్టి చెప్పారు. రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆశించిన స్థాయిలో కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో ధాన్యం నెలలతరబడి రోడ్లమీదే ఉంటోందని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios