రెండు రోజుల్లో వామపక్షాలతో పొత్తులపై స్పష్టత: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
వామపక్షాలతో పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు.
హైదరాబాద్: వామపక్షాలతో పొత్తులపై రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.ఆదివారంనాడు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఓ తెలుగు న్యూస్ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. వామపక్ష పార్టీలతో సీట్ల సర్ధుబాటు విషయమై చర్చలు జరుపుతున్నట్టుగా ఆయన చెప్పారు. రెండు రోజుల్లో ఈ విషయమై స్పష్టత రానుందన్నారు.
సీట్ల సర్ధుబాటు విషయంలో ఆలస్యం అవుతున్న విషయాన్ని ఆయన ఒప్పుకున్నారు. కాంగ్రెస్ టిక్కెట్ల కోసం నేతల మధ్య పోటీ ఉండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తుందని భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. పార్టీ కోసం పనిచేసిన వారిని గౌరవిస్తామని భట్టి విక్రమార్క చెప్పారు. పార్టీ టిక్కెట్టు దక్కకపోతే వారితో పార్టీకి అవసరం లేదనే అభిప్రాయం వీడనాడాలన్నారు. టిక్కెట్ల కేటాయింపులో అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని భట్టి విక్రమార్క చెప్పారు. టిక్కెట్లు దక్కని వారికి పార్టీ అధికారంలోకి రాగానే సముచిత స్థానం కల్పిస్తామని భట్టి విక్రమార్క తేల్చి చెప్పారు.
కర్ణాటక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామన్నారు. కర్ణాటకలో తమ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేస్తుందో లేదో చూపుతామని ఆయన బీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. అబద్దాలను ప్రచారం చేయడం బీఆర్ఎస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్యగా ఆయన పేర్కొన్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19 స్థానాలు మినహాయించి 100 స్థానాలను కాంగ్రెస్ ప్రకటించింది.ఈ నెల 15న 55 మందితో తొలి జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది. ఈ నెల 27న సాయంత్రం 45 మందితో రెండో జాబితాను కాంగ్రెస్ విడుదల చేసింది.
also read:కాంగ్రెస్ తీరుపై సీపీఎం అసంతృప్తి: 'తాము కోరిన సీట్లివ్వకపోతే ఒంటరిగానే బరిలోకి'
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకోవాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకుంది. రెండు పార్టీలకు రెండేసీ అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. సీట్ల సర్ధుబాటుపై కాంగ్రెస్ తీరుపై సీపీఎం తీవ్ర అసంతృప్తితో ఉంది. తాము కోరిన అసెంబ్లీ సీట్లను ఇవ్వాలని సీపీఎం పట్టుబడుతుంది. లేకపోతే ఒంటరిగా బరిలోకి దిగుతామని సీపీఎం తేల్చి చెప్పింది.నవంబర్ 1వ తేదీన సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుంది.ఈ సమావేశంలో పొత్తులపై సీపీఎం కీలక నిర్ణయం తీసుకోనుంది.