హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చఏశారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. కేసీఆర్ పొలిటికల్ టెర్రరిస్ట్ అంటూ విరుచుకుపడ్డారు. మంగళవారం గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సీఎల్పీని టీఆర్ఎస్ లో విలీనం చేస్తామంటూ ఫిరాయింపు ఎమ్మెల్యేలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. 

ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు. అంతకుముందు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కలిసిన మల్లు భట్టివిక్రమార్క ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడం క్విడ్ ప్రో కో కిందకే వస్తాయని స్పష్టం చేశారు. ఫిరాయింపులకు వ్యతిరేకంగా అన్ని వ్యవస్థలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ను వీడే ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని సూచించారు. 

సాగునీటి ప్రాజెక్టుల్లో అవినీతిపై లోక్‌పాల్‌కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. సీఎం కేసీఆర్ రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులపై గవర్నర్ నరసింహన్ కు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. 

పార్టీ మారిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో ప్రజా పరిరక్షణ యాత్రలు చేపడతామని స్పష్టం చేశారు. పినపాక నియోజకవర్గం నుంచి ప్రజాపరిరక్షణ యాత్రను ప్రారంభించనున్నట్లు తెలిపారు. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ న్యాయస్థానాలను సైతం ఆశ్రయిస్తామని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క స్పష్టం చేశారు.